
పోలీసు వ్యవస్థపై నమ్మకం పెంచాలి
మల్హర్: ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కి రణ్ ఖరే తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది పనితీరును, రికార్డులను పరిశీలించారు. నిందితుల అరెస్ట్, కోర్టు పెండింగ్ కేసులు, వాటికి సంబంధించిన దర్యాప్తు వివరాలను, రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎస్సై నరేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని, భరోసా కలిగించాలని చెప్పారు. నేరాల కట్టడి కోసం మరింత శ్రమించడంతో పాటు, నేరం జరిగిన వెంటనే వేగంగా స్పందించాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు మహేంద్ర కుమార్, రజన్‌కుమార్, సీసీ ఫసీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.