
అటవీశాఖ అడ్డంకి..
కాళేశ్వరం: కాళేశ్వరం టు మహదేవపూర్ 353(సీ) 17 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులకు రెండున్నరేళ్ల క్రితం స్వయాన ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో నేటికీ పనులు ప్రారంభం కాలేదు. 2.5 కిలోమీటర్ల రహదారిలో వ్యవసాయ భూములు ఉండగా.. 14.5 కిలోమీటర్లకు అటవీశాఖ అడ్డంకిగా మారింది. పనులు పూర్తయితే మహారాష్ట్రతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలకు సులభం అవుతుంది.
16 మీటర్లకు కుదింపు..
జాతీయ రహదారికి ఒక వైపున 22 మీటర్ల వెడల్పుతో చేపట్టాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో అడవిలో చెట్లు కోల్పోవాల్సి వస్తుంది. దీంతో 16 మీటర్ల వరకే తొలగించడానికి ఆటవీ శాఖ నిర్ణయం తీసుకోవడంతో జాతీయ రహదారి అధికారులు కూడా అంగీకరించారు. మరో వైపు జెన్‌కో నీటి సరఫరా పైపులైను ఉండటంతో విస్తరణకు ఒకవైపు మాత్రమే భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఏడాది కిందటే విస్తరణలో కోల్పోనున్న చెట్లను లెక్కించి నంబర్లు కూడా వేశారు. 15 కిలోమీటర్ల మేర 109 రకాల 7,529 వృక్షాలు తొలగించాలి. వీటికి సంబంధించిన విలువ సుమారుగా రూ.2.67కోట్లుగా అటవీశాఖ అంచనా వేశారు. భూమికి బదులు భూమి ఆటవీ శాఖకు ఇవ్వాల్సి ఉంది. ఓ ఏజెన్సీ అటవీశాఖకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. చిట్యాల, గణపురం మండలాల్లో 21 హెక్టార్ల భూమిని కూడా కేటాయించారు. రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వేలు చేపట్టి అప్పగించాల్సి ఉంది. కాలయాపన జరుగుతుండడంతో అనుమతులు రావడం లేదు.
2.5 కిలోమీటర్లు వ్యవసాయ భూములు
కాళేశ్వరం శివారు నుంచి అంతర్రాష్ట్ర గోదావరి వంతెన వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల రహదారి విస్తరణపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. మూడుచోట్ల ప్రతిపాదన చేసినా స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బస్టాండు నుంచి పాతరోడ్డు మార్గం, సబ్‌స్టేషన్ నుంచి పోలీస్‌స్టేషన్ వెనుక నుంచి రైతుల పొలాల మీది మార్గం, ముక్తివనం పక్క నుంచి విస్తరించడమా అనేది అధికారులు ఇంకా తేల్చలేదని తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రైతుల పొలాల మీదుగా రెవెన్యూ, ఎన్‌హెచ్ ఇంజనీర్లు సర్వేచేసి ఎంజాయ్‌మెంట్ సర్వే కన్నెపల్లి మలుపు వరకు చేశారు. ఈ విషయమై వరంగల్ ఎన్‌హెచ్ ఈఈ మనోహర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
కాళేశ్వరం టు మహదేవపూర్ 353(సీ) ఎన్‌హెచ్‌కు గ్రహణం
రూ.163 కోట్ల వ్యయంతో
జాతీయ రహదారి
2022లో పనులకు
ప్రధాని మోదీ శంకుస్థాపన
14.5 కిలోమీటర్లకు
అనుమతులు ఇవ్వని అటవీశాఖ
ఏళ్లుగా మరమ్మతులే..
మహదేవపూర్ నుంచి కాళేశ్వరం మధ్య వాహనాల రద్దీతో రహదారికి గుంతలు పడుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుదురుపల్లి వద్ద వంతెన దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి వెంట ప్రతియేటా తాత్కాలిక మరమ్మతులు చేసి ఎన్‌హెచ్ ఇంజనీర్లు చేతులు దులుపుకుంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి.. నిత్యం వేల సంఖ్యలో కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి నిత్యం వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో గోతుల్లో నీరు నిలిచి ప్రమాదకరంగా ఉంటుంది.
పీఎం మోదీతో శంకుస్థాపన..
జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరిపై నిర్మించిన అంతర్రాష్ట వంతెన నిర్మాణంతో ఈ రహదారిపై రాకపోకలతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలతో రద్దీగా మారింది. 353(సీ) కాళేశ్వరం–మహదేవపూర్ మధ్య రహదారి ఇరుకుగా ఉండడంతో 2022 నవంబరు 12న రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, వర్చ్యువల్ పద్ధతిలో రూ.163 కోట్లతో నిధులతో శంకుస్థాపన చేశారు.
అనుమతులు రాలేదు..
మహదేవపూర్ టు కాళేశ్వరం రోడ్డుకు అనుమతులు రాలేదు. ఉన్నతాధికారులు మరింత సమాచారం కావాలని అడగగా ఈ మధ్యలోనే పంపాము.
– నవీన్‌కుమార్, జిల్లా అటవీశాఖ అధికారి

అటవీశాఖ అడ్డంకి..