
అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి: వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న మూడు రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉన్నందున అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం వివరించారు. 2023లో మోరంచవాగు ఉప్పొంగి భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మనుషులు, పశువులు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అత్యవసర సేవల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలకు కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు కలెక్టర్‌లో కంట్రోల్ రూం నంబర్ 90306 32608 లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 100కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదని, అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుని క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు. తన అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్లొద్దని స్పష్టం చేశారు. చెరువుల సామర్థ్యాలను పరిశీలించి పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ఏ సమయంలో కుండపోత వర్షం పడుతుందో తెలియదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి..
అటవీ సంరక్షణలో ప్రతీ శాఖ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన అటవీ సంరక్షణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, అటవీ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, పర్యాటక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పీ నరేష్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
అత్యవసరం అయితేనే
బయటకు రావాలి
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది
సెలవులు రద్దు
కలెక్టర్ రాహుల్ శర్మ
ఉపాధ్యాయుల గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరుపై పొంతన లేని సమాధానం చెప్పిన ప్రధానోపాధ్యాయుడిపై కలెక్టర్ రాహుల్‌శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మ తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లకు తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీదేవి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీఓ నాగరాజు, ఆర్‌ఐ రామస్వామి, హాస్టల్ వార్డెన్ సమ్మయ్య, డాక్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి