
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
భూపాలపల్లి అర్బన్: పని గంటలు పెంచుతూ సింగరేణి ఉద్యోగులు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తున్న మల్టీ డిపార్ట్‌మెంటల్ అవగాహన సమావేశాలలో భాగంగా మంగళవారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించడానికి, పని గంటలు పెంచుతూ ఎస్‌డీఎల్ యంత్రాలను నడపాలని భద్రతతో కూడిన ఉత్పత్తిని సాధించాలన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఎవరి స్థాయిలో వారు సాధ్యమైనంత వరకు వ్యయాన్ని తగ్గించుకోవాలని కోరారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, అంకితభావంతో పనిచేయాలన్నారు. భద్రత పట్ల అశ్రద్ధ వహించకుండా అధికారులు, సూపర్‌వైజర్లు సంబంధిత ఉద్యోగులకు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి సక్రమంగా పనిచేస్తూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ, సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఏ ఇతర ప్రభుత్వ సంస్థలో లేని విధంగా సింగరేణి సంస్థలో ఉద్యోగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం తేనెటీగల పెంపకం గురించి అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు జోతి, ఎర్రన్న, రాజేశ్వర్, మారుతి, రమేష్, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఏరియా జనరల్ మేనేజర్
ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి