
ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
భూపాలపల్లి అర్బన్: ఎయిడ్స్ నియంత్రణే లక్ష్యంగా ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి తెలిపారు. యూత్ డేను పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ, దిశ క్లస్టర్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి ఐఈసీ క్యాంపెయిన్ ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే అవగాహన కార్యక్రమాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితులు ఏఆర్‌టీ మందులు వాడేలా చూడాలన్నారు. మారుమూల గ్రామాలు, పట్టణాలలో ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రుక్వాన, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కవిత, ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, దిశ డీఎండీఓ సాయి, మారి స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం, క్యాంపేయిన్ కౌన్సిలర్ హరికృష్ణ, టెక్నీషియన్ మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు.