
అసమగ్ర కొలువులు
క్రమబద్ధీకరణకు నోచుకోని సమగ్ర శిక్షా ఉద్యోగులు
భూపాలపల్లి అర్బన్: విద్యాశాఖలో విధులు నిర్వహిస్తున్న సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులు ఆశా, నిరాశలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదని, శ్రమకు తగ్గ వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 368 మంది..
జిల్లావ్యాప్తంగా 13 విభాగాల్లో 368 మంది సమగ్ర శిక్షా ఉద్యోగులు ఉన్నారు. కేజీబీవీల్లో 251 మంది, సీఆర్పీలు 65, ఎంఆర్‌సీ సిబ్బంది 46, డీఈఓ కార్యాలయ సిబ్బంది ఆరుగురు పనిచేస్తున్నారు. కలెక్టర్ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించే యూడైస్, మధ్యాహ్న భోజన పథకం నివేదికల తయారీలో సమగ్ర శిక్షా ఉద్యోగులు కీలక పాత్ర, బియ్యం పంపిణీ, పాఠశాల బయట ఉన్న విద్యార్థులను గుర్తించడం వంటి పనులు ఈ ఉద్యోగులే నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రాష్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యూకేషన్ బోధించే ప్రత్యేక ఉపాధ్యాయులు కూడా ఎస్‌ఎస్‌ఏ పరిధిలోకి వస్తారు.
క్షేత్రస్థాయిలో కీలకపాత్ర
అకౌంటెంట్లు, ఏఎన్‌ఎంలు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, మండలస్థాయిలో సీఆర్పీలు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఐఈఆర్పీలు, వ్యాయామ ఒకేషనల్ ఉపాధ్యాయులు, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, డే, నైట్ వాచ్‌మెన్, స్వీపర్లు, స్కావెంజర్లు, జిల్లాస్థాయిలో ఏపీఓలు, సిస్టం ఎనలిస్టులు, టెక్నికల్ పర్సన్లు, డీఎల్‌ఎంటీ మెసెంజర్లు, మోడల్ స్కూళ్లలో పనిచేసే వార్డెన్లు, ఆపరేటర్లు, కేర్ టేకర్లు కూడా సమగ్ర శిక్షా పరిధిలోకి వస్తారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం బియ్యం సరఫరా, ఉపాధ్యాయుల హాజరు నమోదు, ఆన్‌లైన్‌లో విద్యార్థుల నమోదు, బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం వంటి పనులను నిర్వహిస్తున్నారు. గురుకులాల్లో సీఆర్టీలు, పీజీసీఆర్టీలు బోధన విధులు నిర్వహిస్తుండగా బోధనేతర సిబ్బంది తమకు కేటాయించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకాధికారులు కేజీబీవీల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
సమ్మె విరమణ సమయంలో..
తమ డిమాండ్ల సాధన కోసం గత డిసెంబరు 6నుంచి జనవరి 7వరకు సమ్మె కొనసాగించారు. సమ్మె విరమణ సమయంలో పే స్కేల్ అమలుపై మూడు నెలల్లో మంత్రివర్గ ఉప సంఘ సమావేశం ఏర్పాటు చేస్తామని, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఉత్తర్వులు జారీచేస్తామని, సమ్మె కాలపు వేతనం అందజేస్తామన్నారు. కానీ ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ హక్కుల సాధన కోసం 15 ఏళ్లుగా వివిధ సందర్భాల్లో పోరాటాలు చేస్తూనే వచ్చారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
హామీలు నిలబెట్టుకోవాలి..
సమ్మె సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ లు నిలబెట్టుకోవాలి. స మగ్ర శిక్షాను పూర్తిస్థాయిలో విద్యాశాఖలో విలీనం చేసి ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే ఉత్తర్వులు జారీచేయాలి. పేస్కేల్ అమలు కోసం మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటించాలి. సమ్మె కాలపు వేతనా లు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– చాంద్‌పాషా,
సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఽఘం జిల్లా అధ్యక్షుడు
సమ్మె చేసినా పరిష్కారం కాని సమస్యలు
చాలీచాలని వేతనాలతో
కుటుంబాల పోషణకు అవస్థలు
ప్రభుత్వంపై నమ్మకంతో
ఆశగా ఎదురుచూపు
కుటుంబాల పోషణకు..
పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడంతో కుటుంబాల పోషణకు అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా.. వచ్చే వేతనాలతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికై నా తమను విద్యాశాఖలో విలీనంచేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి వేతనం పెంచాలని రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ.20 లక్షల రిటైర్‌మెంట్ బెనిఫిట్ చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు.

అసమగ్ర కొలువులు

అసమగ్ర కొలువులు