
పేదల కడుపు నింపడమే ధ్యేయం
కాటారం: రాష్ట్రంలోని నిరుపేదల కడుపు నింపడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు అందించి రేషన్ బియ్యం చేరవేయాలని సంకల్పించిందన్నారు. జిల్లాలోని 277 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా 362 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా లాంటి పథకాలే అందుకు నిదర్శనమని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు మేడిగడ్డ వద్ద ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆరుగురి కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందజేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
కాటారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. అంకుషాపూర్, నస్తూర్‌పల్లి గ్రామపంచాయతీ నూతన భవనాలు, చిదినెపల్లి, గుండ్రాత్‌పల్లి, దామెరకుంట, రేగులగూడెం, ఒడిపిలవంచ, బూడిదపల్లి, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు, మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాలకు రూ.20 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు కాటారం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్‌ను మంత్రి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్‌బాబు స్వగ్రామం ధన్వాడలో తన సొంత వ్యవసాయ క్షేత్రం 11 ఎకరాల్లో ఆయిల్ పాం పంట సాగుకు శ్రీకారం చుట్టగా మొక్కలు నాటారు. మండలకేంద్రంలో కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారో త్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్‌శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఎస్‌ఓ కిరణ్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి మణి, ఏఎంసీ చైర్మన్ పంతకాని తిరుమల పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
మంత్రి శ్రీధర్‌బాబు