
ఆదివాసీలను అంతంచేసే కుట్ర
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను అంతం చేసి అటవీ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర చేస్తుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గట్టయ్య హాజరై మాట్లాడారు. సామ్రాజ్యవాదులు, బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలకు దేశంలోని అపారమైన ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. అడవిలో ఉన్న ఆదివాసీలను అంతం చేస్తూ హింస, నిర్బంధం కొనసాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు దుబాసి పార్వతి, సమ్మయ్య, దేవేందర్, బాపు, రాజమణి, శంకర్, సమ్మయ్య, రమేష్ పాల్గొన్నారు.