
రేపటితో రైతుబీమా గడువు ముగింపు
భూపాలపల్లి రూరల్ : అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం రెన్యూవల్ గడువు ఈ నెల12వ తేదీతో ముగయనుంది. జిల్లాలోని రైతులంతా రైతుబీమాను రెన్యూవల్ చేసుకోవాలని, అదేవిధంగా కొత్త పట్టా పాస్‌బుక్ పొందిన రైతులు సైతం సంబంధిత రైతు వేదికల్లో ఏఈఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయశాఖ అధికారి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18నుంచి 59 ఏళ్ల వయసు గలవారు 2025, జూన్ వరకు భూభారతి ద్వారా పట్టా పాస్‌బుక్ పొందిన రైతులు అర్హులని పేర్కొన్నారు. రైతులు ఏదైనా ప్రమాదం, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల మరణించిన పక్షంలో నామినికి ఎల్‌ఐసీ ద్వారా రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తారని వివరించారు. ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని, ప్రతి ఏటా ఆగస్టు 15నుంచి తదుపరి ఆగస్టు 14 వరకు బీమా చెల్లుబాటులో ఉంటుందని వెల్లడించారు. రెన్యువల్ లేదా కొత్తగా నమోదు కావాలనుకునే రైతులు సమీపంలోని ఏఈఓ లేదా రైతు వేదికలో గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని బాబు సూచించారు.
జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి బాబు