
అధికారులు కావలెను..
భూపాలపల్లి: పెద్ద భవనం.. విశాలమైన గదులు.. ఒక్కో విభాగానికి ప్రత్యేక గది.. ఫర్నీచర్.. విధులు నిర్వర్తించేందుకు మాత్రం అధికారులు, సిబ్బంది కొరత.. ఇదీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిస్థితి. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయిన సమయంలో మంజూరైన పోస్టులే నేటికీ కొనసాగుతున్నాయి. అందులోనూ సగానికి పైగా పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఫలితంగా అభివృద్ధి కుంటుపడటమే కాక పలు పనులు ఆలస్యం అవుతున్నాయి.
అన్ని విభాగాల్లో సగం ఖాళీలే..
గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లి 2012 జనవరి 21న నగర పంచాయతీగా, 2017 ఆగస్టు 18న గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. మున్సిపాలిటీకి 34 పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం సగం ఖాళీగానే ఉన్నాయి. మేనేజర్ రెండు నెలల క్రితం డిప్యూటేషన్‌పై బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా వెళ్లగా ఆ స్థానంలో ఎవరిని నియమించలేదు. ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్ ఉండాల్సి ఉండగా లేరు. సీనియర్ అసిస్టెంట్లు ముగ్గురికి బదులుగా ఇద్దరు, ఒక సిస్టం మేనేజర్, ఒక సిస్టం అసిస్టెంట్(డాటా ఎంట్రీ ఆపరేటర్) లేరు. దీంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిస్టం అసిస్టెంట్‌ను నియమించుకున్నారు. వార్డు ఆఫీసర్ పోస్టులు రెండు ఉండగా ఇద్దరు ఉన్నారు. అకౌంట్ సెక్షన్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ ఒకరు చొప్పున ఉండగా, సీనియర్ అకౌంటెంట్ పోస్టు ఒకటి ఉన్నప్పటికీ ఖాళీగా ఉంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్ డిప్యూటేషన్‌పై వరంగల్ వెళ్లగా జూనియర్ అసిస్టెంటే ఆ విధులు నిర్వర్తిస్తున్నాడు. హెల్త్ అసిస్టెంట్ ఇద్దరికి గాను ఒకరు, శానిటరీ జవాన్‌లు ముగ్గురికి గాను ఇద్దరు ఉన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ ఒక పోస్టు ఉండగా ఇటీవలే భర్తీ చేశారు. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉండగా సీడీఎంఏ నుంచి ఔట్ సోర్సింగ్‌పై ఒకరు వచ్చి పని చేస్తున్నారు. అసిస్టెంట్ ఈఈ ఒకరు ఉండగా, ఒక డ్రాఫ్ట్‌స్‌మ్యాన్, ఒక వర్క్ ఇన్‌స్పెక్టర్, క్యాడ్ ఆపరేటర్ లేరు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో టీపీవో, టీపీఎస్, టీపీబీవో, ట్రేసర్, క్యాడ్ ఆపరేటర్, టౌన్ సర్వేయర్ ఒకరు చొప్పున ఉండాల్సి ఉండగా టీపీవో, టీపీబీవో మాత్రమే ఉన్నారు.
ఉన్నతాధికారులకు
నివేదిక పంపాం..
మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులకు నివేదించాం. కొత్త పోస్టులను కూడా మంజూరు చేయాలని కోరాం. ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని పోస్టులను ఔట్‌సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేశాం.
– బిర్రు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్
భూపాలపల్లి మున్సిపాలిటీలో ఆఫీసర్లు, సిబ్బంది కొరత
నగర పంచాయతీగా ఏర్పడినప్పటి పోస్టులే
అందులోనూ సగానికి పైగా ఖాళీలు
కొత్త పోస్టుల మంజూరు ఊసే లేదు
కుంటుపడుతున్న అభివృద్ధి పనులు
అదనపు పని భారం..
భూపాలపల్లి మున్సిపాలిటీకి మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం, కొత్తవి మంజూరు కాకపోవడంతో ప్రస్తుతం ఉన్న అధికారులు, సిబ్బందికి పని భారం తప్పడం లేదు. పట్టణంలో నివాస భవనాలు 10,952, నివాస భవనాలు 834, వ్యాపార సముదాయాలు 567, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలు 1,211 ఉన్నాయి. వీటి నుంచి ప్రతిఏటా సుమారు రూ. 3 కోట్లకు పైగా ఆస్తి పన్ను రావాల్సి ఉంటుంది. అయితే పన్నుల వసూలుకు ఇద్దరు బిల్ కలెక్టర్లు మాత్రమే ఉన్నారు. వీరిద్దరే పట్టణంలోని 30 వార్డుల్లో పన్నులు వసూలు చేయలేరు. దీంతో అధికారులు చేసేది లేక ఔట్‌సోర్సింగ్ పద్ధతిన సిబ్బందిని నియమించుకుని పన్నులు వసూలు చేపిస్తున్నారు. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగంలో టీపీవో, టీపీబీవో మాత్రమే ఉండటంతో అన్నింటిని పర్యవేక్షించడం వీలు కావడం లేదు. ఫలితంగా పట్టణంలో అనుమతి లేని కట్టడాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, డ్రాఫ్ట్‌మెన్స్ లేకపోవడంతో అన్నీ ఏఈనే చూసుకోవాల్సి వస్తోంది. దీంతో వివిధ అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భూపాలపల్లి మున్సిపాలిటీకి సరిపడా అధికారులు, సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారులు కావలెను..