
దొంగల బీభత్సం
భూపాలపల్లి అర్బన్: రాఖీ పండుగ జిల్లా కేంద్రంలోని పలువురు ఇళ్లలో విషాదంగా మారింది. రాఖీలు కట్టేందుకు సొంత ఊళ్లు, సోదరుల వద్దకు వెళ్లి వచ్చే సరికి దొంగలు ఇళ్లను దోచుకెళ్లారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో ఒక లైన్‌లో ఉన్న 3 ఇళ్లతో పాటు మరో లైన్‌లోని 4 పక్కపక్కనే ఉన్న ఇళ్లలో శనివారం రాత్రి దొంగతనాలకు పాల్పడ్డారు. మరో మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. ఈ నెల 9వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో కొంత మంది 8న, మరి కొందరు 9వ తేదీన వారివారి బంధువుల ఇళ్లకు వెళ్లారు. తిరిగి ఆదివారం ఇంటికి వచ్చి కొందరు చూసే వరకు, మరికొందరివి ఇంటి పక్కన వారు చూసి దొంగతనం జరిగిందని సమాచారం అందించారు. ఇంటి తాళాలు పగులకొట్టి ఉండగా ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరువాలు ధ్వంసం చేసి ఉన్నాయి.
26 తులాల బంగారం..
రూ.2.38లక్షల నగదు
లక్ష్మీనగర్‌లో 10 ఇళ్లలో జరిగిన చోరీలో మూడు ఇళ్లలో ఎటువంటి బంగారు ఆభరణాలు, నగదు లేవు. మిగితా ఏడు ఇళ్లలో 26 తులాల బంగారం, 53 తులాల వెండి, రూ.2.38 లక్షల నగదు అపహరణకు గురైంది. బాధితులు కథనం ప్రకారం.. బడితల సంతోష్ ఇంట్లో 12 తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.58వేల నగదు, చదువు రాకేశ్ రెడ్డి ఇంట్లో రూ.70వేలు, ఓదెల సుమతి ఇంట్లో 8 గ్రాముల బంగారం, రూ. 25వేల నగదు, నగునూరి రాజశేఖర్ ఇంట్లో తులం బంగారం, రూ.37వేలు, ఆకుల రాజ్‌కుమార్ ఇంట్లో తులం బంగారం, రూ.30 వేలు, ప్రవీణ్ ఇంట్లో తులం బంగారం, రూ.45 వేలు, 30 తులాల వెండి, మాచనపల్లి సురేశ్ ఇంట్లో 10 తులాల బంగారం అపహరణకు గురైంది. అదే కాలనీకి చెందిన జక్కుల రాములు ఇంటితో పాటు మరో ఇద్దరి ఇళ్లలో చోరీకి ప్రయత్నించగా ఎటువంటి బంగారు వస్తువులు, నగదు లభించలేదు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా..
జిల్లా కేంద్రంలో నేర నియంత్రణ, దొంగతనాలను అదుపు చేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దొంగతనాలు ఆగడం లేదు. జూన్‌లో ఆరుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. అయినప్పటికీ గతంలో మాదిరిగానే దొంగతనాలు జరుగుతున్నా పోలీస్ శాఖ ఏం చేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.
సంఘటన స్థలం పరిశీలన
దొంగతనాలు జరిగిన ఇళ్లను స్థానిక సీఐ నరేష్‌కుమార్‌తో పాటు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బంది వేలి ముద్రలు సేకరించారు. విచారణ వేగవంతం చేసి దొంగలను పట్టుకుంటామని సీఐ నరేష్‌కుమార్ తెలిపారు. కాలనీ చుట్టు పక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలలో వీడియోలను పరిశీలిస్తున్నారు.
ఒకే రోజు రాత్రి 10 ఇళ్లలో చోరీ
రాఖీ పండుగకు వెళ్లి వచ్చే సరికి
ఇళ్లు గుల్లా
నాలుగు నెలలుగా
తరచూ దొంగతనాలు
విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు అపహరణ
నిద్రావస్థలో పోలీసులు
పోలీసుల నిఘా కరువు
జిల్లా కేంద్రంలో నాలుగైదు నెలలుగా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఒక సీఐ, నలుగురు ఎస్సైలతో పాటు ఏఎస్సై, కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దొంగతనాలు జరుగుతున్నాయి. జరిగిన ప్రతీసారి 5 ఇళ్లకు మించి దోపిడీకి గురవుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం ప్రత్యేక నిఘా పెట్టన్నట్లు కనిపిస్తోంది. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్, బ్లూకోర్ట్ టీమ్ కాలనీల్లో గస్తీ చేపట్టకుండా ఏం చేస్తుందని పలువురు బాధితులు మండిపడుతున్నారు. గత మూడు నెలల క్రితం పోలీస్‌స్టేషన్ పక్కనే సుమారు ఐదు సింగరేణి క్వార్టర్లు, ఎండీ క్వార్టర్లలో దొంగతనాలతో పాటు వివిధ కాలనీల్లో దొంగతనాలు జరుగుతున్నా ఎందుకు నియత్రించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దొంగల బీభత్సం

దొంగల బీభత్సం