కాటారం : మండలంలో నేడు (సోమవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పర్యటించనున్నారు. స్థానిక బీఎల్‌ఎం గార్డెన్స్‌లో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు పత్రాలు, సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, మేడిగడ్డ వద్ద ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెక్కుల అందజేతలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం కాటారం గ్రామ పంచాయతీ సమీపంలో రూ.36 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్, మద్దులపల్లి, ధర్మసాగర్, అంకుషాపూర్, రేగులగూడెం నూతన గ్రామపంచాయతీ, అంగన్‌వాడీల నూతన భవన నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
అయ్యప్ప ఆలయంలో నిర్వహించనున్న ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలోను ఆయన పాల్గొననున్నారు. అలాగే మహాముత్తారం మండలంలో రూ.2.30 కోట్లతో నిర్మించిన కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించి పోలారం, కొర్లకుంట, మహబూబ్‌పల్లి, నిమ్మగూడెం, ములుగుపల్లి, మదారం, బోర్లగూడెం గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కార్యక్రమాలకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
కుమారస్వామికి నేషనల్ అవార్డు
భూపాలపల్లి రూరల్: బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు 2025 సంవత్సరానికి గాను కాళేశ్వరం దేవస్థానం సరస్వతి పుష్కర ఉత్సవ కమిటీ మెంబర్‌గా ఓదెల కుమారస్వామి సేవలందించడం పట్ల బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ జాతీయ అవార్డు నేషనల్ కమిటీ చైర్మన్, జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వానపత్రాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో ఓదెలుకు అందజేశారు అవార్డును వచ్చే నెల సెప్టెంబర్ 5న తిరుపతిలోని గంధమనేని శివయ్య మెమోరియల్ ట్రస్టు కమ్యూనిటీ హాల్‌లో అందజేయనున్నట్లు వెల్లడించారు.
42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేసి బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ిసీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రానికి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్‌లో చట్టం చేయకుండా మతం రంగు పులుముతోందని విమర్శించారు. రిజర్వేషన్లు మత ప్రాతిపాదికన కాదని, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసమన్నారు.
హేమాచలుడికి భక్తిశ్రద్ధలతో పూజలు
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్లు, ప్రైవేటు బస్సులు, ఆటోలలో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు.
అత్యంత భక్తిశద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట పూజారులు గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు.

నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన