గణపురం: మండల 108 వాహనాన్ని 108 జిల్లా మేనేజర్ మేరుగు నరేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని మెడిసిన్‌తో పాటు మెడికల్ ఎక్విమెంట్స్‌ను పరిశీలించారు. రికార్డులతో పాటు మూడు నెలల కాలం అందించిన సేవలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనంలో కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకుంటూ కాల్ వచ్చిన వెంటనే స్పందించి వాహనం బయలు దేరాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని.. నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ బాలరాజు, పైలెట్ రషీద్ ఉన్నారు.
సీఐల బదిలీ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గణపురం నూతన సర్కిల్ సీఐగా సీహెచ్ కరుణకర్‌రావు ఆదిలాబాద్ టూ టౌన్ నుంచి బదిలీపై రానున్నారు. సీసీఎస్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశ్వర్లు మహదేవపూర్ సీఐగా, ఎస్‌బీ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ సీసీఎస్‌కు బదిలీ చేశారు.
గణపురం సీఐగా కరుణాకర్‌రావు
గణపురం: జిల్లాలో నూతనంగా ఏర్పడిన గణపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సీహెచ్ కరుణాకర్‌రావును నియమిస్తూ ఐజీ మల్టీజోన్–1 చంద్రశేఖర్‌రెడ్డి శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలతో ఇటీవల సర్కిల్‌ను ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్‌రావును గణపురం సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు రోజుల్లో ఆయన విధుల్లో చేరనున్నట్లు సమాచారం.
సింగరేణి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో సింగరేణి కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా ఆస్పత్రి పనితీరు, వైద్యుల సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, మెరుగైన వైద్య సదుపాయాల కల్పనపై చర్చించారు. కార్మికుల సమస్యలు, గృహ వసతి, భద్రతా చర్యలు, సింగరేణి పార్క్, సింగరేణి కార్మికుల కాలనీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
మొగిలికి సిరిమంజరి రత్న అవార్డు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుప్పటి మొగిలికి సిరిమంజరి రత్న అవార్డును అందజేశారు. జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో శనివారం కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుప్పటి మొగిలికి ‘సిరిమంజరి రత్న’ బిరుదుతో ఘనంగా సత్కరించారు. నూతన కవితా ప్రక్రియ అయిన సిరిమంజరిలో దుప్పటి మొగిలి రచించిన అర్ధ శతకంకు బిరుదు ప్రదానం చేసినట్లు ఆ సంస్థ సీఈఓ ఎంవీ రత్నం ఒక ప్రకటనలో పేర్కొన్నాను.
పేకాట స్థావరంపై దాడి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం దాడిచేశారు. ఎస్సై పవన్‌కుమార్ కథనం ప్రకారం.. బొమ్మాపూర్ అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు దాడిచేసి ఐదుగురిని పట్టుకున్నారు. రూ.20,020 నగదు, 7 బైక్‌లు, మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

108 వాహనం తనిఖీ