
పింఛన్ జారీ ఇక ఈజీ
భూపాలపల్లి రూరల్: ఆసరా పింఛన్లను ఇక నుంచి ఫేస్ రికగ్నైజేషన్ (ముఖ గుర్తింపు) విధానంలో అందజేయనున్నారు. ఇప్పటి వరకు వేలి ముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా పింఛన్లు ఇస్తున్నారు. ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో.. ప్రభుత్వం ఆయా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ, సులభంగా పింఛన్ అందజేసేలా రికగ్నైజేషన్ యాప్ ద్వారా ఫొటోలు తీసి, అప్లోడ్ చేసి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం గత నెలలో పోస్టాఫీస్, బీపీఎంలకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌తో కూడిన సెల్‌ఫోన్లు అందజేశారు. ఈనెల నుంచే ఫేస్ రికగ్నైజేషన్ విధానం ద్వారా పింఛన్లు అందజేయాలని నిర్ణయించారు.
వేలిముద్రతో ఇబ్బందులు..
ఇదివరకు పింఛన్ పొందాలంటే కచ్చితంగా పోస్టాఫీసులకు వెళ్లి ఆయా అధికారుల వద్ద బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే వృద్ధులకు వేళ్లపై ముద్రలు చెరిగిపోయి స్కాన్ కాకపోవడంతో వారు పింఛన్ తీసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.. మరోవైపు ఐరిష్‌లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాంటి వారు మండల, వార్డు అధికారులు ప్రత్యేకంగా రాసిచ్చిన పత్రం ద్వారా పింఛన్లు పొండుతున్నారు. వృద్ధుల్లో కొందరు రోగాల బారిన పడి ఇంటికే పరిమితమైన సమయంలో పింఛన్లు పొందలేకపోతున్నారు.
సులభంగా అందేలా..
బయోమెట్రిక్ విధానంలో పింఛన్లు ఇవ్వడంలో తలెత్తుతున్న సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌ను తీసుకొచ్చింది. ప్రభుత్వం అందజేసే సెల్‌ఫోన్‌లో బీపీఎంలు.. పింఛన్‌దారుల పేర్లు, వివరాలను అప్‌లోడ్ చేస్తారు. యాప్ ద్వారా ఫొటో తీసిన వెంటనే పింఛన్‌దారుడి వివరాలు వస్తాయి. వారికి పింఛన్ చెల్లించినట్లు నమోదు చేసి, నగదు అందజేస్తారు. నడవలేని వారు, వివిధ రోగాలతో మంచాలకే పరిమితమైన వారికి చివరి రోజు ఇళ్లకు వెళ్లి ఫొటో తీసి పింఛన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ప్రతి లద్ధిదారుడికి సులభంగా పింఛన్ అందనుంది.
బీపీఎంలకు శిక్షణ
పింఛన్ల పంపిణీలో ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేప్తోంది. ఈనెలలో ఇచ్చే పింఛన్లకు కొత్త విధానాన్ని వర్తింపజేస్తున్నాం. జిల్లాల్లోని బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లకు (బీపీఎం) ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన మొబైల్స్ ఇచ్చారు. ఆ యాప్‌ను ఉపయోగించి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
– బాలకృష్ణ, డీఆర్డీఓ, భూపాలపల్లి
జిల్లాలో ఇలా..
పింఛన్ రకం లబ్ధిదారులు
వృద్ధాప్య 21,040
వితంతు 19,243
వికలాంగులు 5,600
కల్లుగీత 1,364
చేనేత 778
పైలేరియా 38
డయాలసిస్ 51
బీడీ కార్మికులు 38
ఒంటరి మహిళలు 1,075
మొత్తం లబ్ధిదారులు 49,227
ముఖ గుర్తింపుతో పింఛన్
బయోమెట్రిక్ సమస్యకు చెక్ పెట్టేలా
ఫేస్ రికగ్నైజేషన్
బీపీఎంలకు సెల్ ఫోన్లు అందజేసిన
ప్రభుత్వం
ఈనెల నుంచే కొత్త విధానంలో
పింఛన్ల పంపిణీ
జిల్లా వ్యాప్తంగా 49,227 మంది
పింఛన్‌దారులు

పింఛన్ జారీ ఇక ఈజీ