
వసతి గృహాల్లో భోజనంపై ప్రత్యేక దృష్టి
భూపాలపల్లి: జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుండి వసతి గృహాల జిల్లా అధికారులు, పర్యవేక్షణ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వార్డెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్దేశిత మెనూని తప్పకుండా పాటించాలని తెలిపారు. వంట గదులు, సామాన్లు భద్రపరచు గదులు, పారిశుద్ధ్యం నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, ఆర్‌ఓ ప్లాంట్ల పనితీరు, కూరగాయలు, మాంసం, పప్పుల సరఫరాపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ మూడు రోజులకొకసారి ప్రత్యేక అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ప్రత్యేక అధికారులు, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
విచారణ వేగిరం చేయాలి..
భూభారతి దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి భూభారతి దరఖాస్తుల పరిశీలనపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతిలో వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి విచారణ పూర్తి చేయాలని, ప్రభుత్వ ఆదేశం ప్రకారం నిర్దేశిత సమయానికి పూర్తి చేయని తహసీల్దార్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ రవి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు
మొగుళ్లపల్లి: విద్యార్థుల సంక్షేమం విషయంలో అలసత్వాన్ని సహించబోమని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. మంగళవారం కొర్కిశాల కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థినుల అస్వస్థత ఘటనపై తెలుసుకున్నారు. ఘటనపై ఎస్‌ఓకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించిన నలుగురు వంట మనుషులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సమస్యలు తెలియజేసేందుకు ఫిర్యాదు బాక్స్ ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఇన్‌చార్జ్ వైద్యాధికారి శ్రీదేవి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ గోదాం పరిశీలన
మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘంలోని ఎరువుల గోదాంను కలెక్టర్ రాహుల్‌శర్మ తనిఖీ చేశారు. రైతులు ఎవరూ అధైర్య పడద్దని రైతులకు సరిపడా ఎరువులు, యూరియా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట డీఏఓ బాబురావు, ఏడీఏ రమేష్, ఏఓ సురేందర్‌రెడ్డి, తహసీల్దార్ సునీత, సీఈఓ అప్పం సాగర్ ఉన్నారు.
భూ భారతి దరఖాస్తుల విచారణ వేగిరం చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ

వసతి గృహాల్లో భోజనంపై ప్రత్యేక దృష్టి