పుష్కర స్నానం.. సకల పాప హరణం | - | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానం.. సకల పాప హరణం

May 17 2025 6:35 AM | Updated on May 17 2025 6:35 AM

పుష్కర స్నానం.. సకల పాప హరణం

పుష్కర స్నానం.. సకల పాప హరణం

రెండో రోజు సరస్వతి పుష్కరాలకు తరలివచ్చిన భక్తులు

భూపాలపల్లి/కాళేశ్వరం:

యశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతినది పుష్కరాలకు రెండో రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. నదీమాతకు పండ్లు, పూలు, పాటు, పసుపు, కుంకుమ, చీరె, సారెను సమర్పించారు. దీపాలు వదిలారు. సైకత లింగాలు చేసి ఆరాధన చేశారు. పితృతర్పనాలు, పిండప్రదానాలు చేశారు. బ్రాహ్మణ ముత్తయిదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. భక్తుల కష్టాలు, ఇబ్బందులు తొలగిపోవాలని కోరుతూ కాళేశ్వరాలయంలో సంకష్టహర గణపతి హోమం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదపండితులు రెండోరోజు హోమాలు, విశేష పూజలు చేశారు. రాత్రి కాశీపండితుల ఆధ్వర్యంలో నదికి నవరత్నమాల హారతి ఇచ్చారు.

గోదావరి, ఆలయ పరిసరాల్లో కిటకిట..

శుక్రవారం తెల్లవారుజామునుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లనుంచి తరలివచ్చిన భక్తజనంతో గోదావరి తీరం, ఆలయం కిక్కిరిసింది. ఉదయంనుంచి 10గంటలలోపు భక్తులు పలుచగా ఉండగా, మధ్యాహ్నం వరకు రద్దీ పెరిగింది.

నిండిన పార్కింగ్‌ స్థలాలు, చలువ పందిళ్లు..

ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్‌, ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలిరావడంతో పార్కింగ్‌ స్థలాలు కిటకిటలాడాయి. వరంగల్‌, భూపాలపల్లి మీదుగా తరలి వస్తున్న భక్తులు, వాహనాలను వీఐపీఘాట్‌, ఇప్పలబోరు వైపు పార్కింగ్‌లకు పోలీసులు తరలించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మంచిర్యాల వైపునుంచి వచ్చే వాహనాలను బస్టాండ్‌ సమీపంలోని పార్కింగ్‌ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడినుంచి ఘాట్‌ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచిత ఆర్టీసీ షెటిల్‌ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు కూడా అనుమతివ్వడంతో భక్తులను పార్కింగ్‌ స్థలాలనుంచి సరస్వతి ఘాట్‌, అక్కడినుంచి ఆలయానికి తరలిస్తున్నారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో భక్తులు చలువ పందిళ్లకింద సేదదీరడం కనిపించింది.

వీకెండ్స్‌లో పెరగనున్న భక్తుల తాకిడి..

శని, ఆదివారాల్లో భక్తుల తాకిడి రెట్టింపుస్థాయిలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గోదావరి తీరం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు శుక్రవారం వచ్చిన భక్తులతోనే నిండాయి. శని, ఆదివారాల్లో లక్షమందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు అధికారులు మరిన్ని ఏర్పాట్లు చేస్తే ఇబ్బందులు ఉండవని, లేనిపక్షంలో ఎండకు మాడిపోవాల్సిందేనని భక్తులు అంటున్నారు.

వీఐపీల రాక..

రెండవ రోజు సరస్వతినదిలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి ఇన్‌చార్జ్‌ జడ్జి పట్టాభిరాంలు వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి, శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకున్నారు.

పుష్కర స్నానం చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీఐపీలు

పుష్కరాల మరిన్ని వార్తలు,

ఫొటోలు II, IIIలో..

సుమారు 80వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరణ

కిటకిటలాడిన సరస్వతి ఘాట్‌, దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement