
ఆర్టీసీ అత్యుత్సాహం
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఐదు మండలాలకు ప్రధాన కూడలి అయిన కాటారం మండలకేంద్రంలో పలు డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులను ఆపకుండా డ్రైవర్లు ప్రయాణికులను, భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాళేశ్వరం పుష్కరాల కోసం కరీంనగర్ నుంచి వచ్చే భక్తులు డైరెక్ట్ బస్సులు లేకపోతే కాటారంలో బస్సు దిగి కాళేశ్వరం వైపుగా వెళ్లే బస్సు ఎక్కాల్సి వస్తుంది. కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన ప్రయాణికులు, భక్తులు సైతం కాటారం ప్రధాన కూడలిలో బస్సు ఎక్కి మహదేవపూర్, కాళేశ్వరం వెళ్లాల్సి ఉంటుంది. భూపాలపల్లి, మంథని, కరీంనగర్, వరంగల్, గోదావరిఖని డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు కాటారంలో నిలపడం లేదని భక్తులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాల స్పెషల్ అని బోర్డు పెట్టుకున్న బస్సులతో పాటు సాధారణ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు సైతం స్టాఫ్ లేదంటున్నారని భక్తులు తెలుపుతున్నారు. దీంతో గంటల తరబడి ఎర్రటి ఎండలో రహదారిపై నిల్చొని బస్సుల కోసం చేతులు అడ్డుపెట్టాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ప్రైవేట్ వాహనాల్లో అధిక ధర చెల్లించి వెళ్లాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. సాధారణ సమయంలో నిత్యం కాటారంలో ఆర్టీసీ బస్సులు నిలిపే అధికారులు ఇప్పుడు ఎందుకు ఆపడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఎలా వెళ్తారని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ హిందును సాక్షి వివరణ కోరడానికి ప్రయత్నించగా స్పందించలేదు.
కాటారంలో నిలపని ఆర్టీసీ బస్సులు
భక్తులు, ప్రయాణికుల ఇబ్బందులు