
సౌకర్యాలు అక్కర్లేదా?●
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాల్లో పుణ్యస్నానాలకు వచ్చే సామాన్యులకు కనీసం సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అసహనం వ్యక్తంచేశారు. ఈ నెల 15నుంచి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరినదిలో ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన పుష్కర పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానుండగా ఎక్కడ కూడా పనులు పూర్తి కాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇద్దరూ కలిసి సరస్వతి పుష్కరాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సరస్వతి అమ్మవారి మండపాన్ని చూస్తే పుష్కర పనులు ఎలా చేస్తున్నారో అర్థం అవుతుందన్నారు. మంథని ఎమ్మెల్యే మంత్రిగా ఉండగా ఆయన సతీమణి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉందని, వీరిద్దరు సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ఉన్నా.. ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పుష్కర పనులను ఎలాంటి నైపుణ్యంలేని కాంగ్రెస్ వాళ్లకు అప్పగించారని, అధికారులు క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు చేయాలన్నారు. ఈ క్రమంలోనే నాణ్యతలేని పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సరస్వతి పుష్కరాల్లో జరిగిన పనులపై క్వాలిటీ పరీక్షలు నిర్వహించాలని, సమగ్ర విచారణ జరిపించడంతో పాటు పనులకు సంబంధించిన నిధులు, పనులు, టెండర్ల జారీ ప్రక్రియపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్కరాల్లో సామాన్యులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, లేనిపక్షంలో తాము బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు. ఆయన వెంట శ్రీనివాసరావు, అడప సమ్మయ్య, శ్రీపతి బాపు, మోహన్‌రెడ్డి, శ్రీహరి, జక్కు రాకేష్, జవ్వాజీ తిరుపతి, అలీంఖాన్, సుజాత, పోత వెంకట్‌స్వామి ఉన్నారు.