జనగామ: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. నేటి(మంగళవారం)కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం, శివనామస్మరణ, ఉపవాసం, ఆలయ దర్శనం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వందలాది మంది భక్తులు ఆలయాలను సందర్శించే అవకాశం ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
దీపారాధనకు విశిష్ట స్థానం
కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో తెల్లవారు జామున స్నానాలు, శివాలయ దర్శనాలు, అభిషేకాలు, దీపారాధనలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపజేసే దీపం జ్ఞానానికి, భక్తికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా భావిస్తారు.
పూజా సామగ్రి కొనుగోళ్లు..
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో వ్యాపారం జోరుగా సాగింది. పౌర్ణమి పూజల కోసం అవసరమైన ఉసిరి కొమ్మలు, మామిడి కొమ్మలు, మట్టితో తయారు చేసిన దీపాలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
శివనామస్మరణతో
మార్మోగనున్న ఆలయాలు
అఖండ జ్యోతుల వెలుగుల్లో పుణ్యక్షేత్రాలు


