● అధికారులను ఆదేశించిన మంత్రులు దామోదర, పొన్నం
● రూ.154 కోట్లతో నిర్మాణాలు
జనగామ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ (సీసీబీ) ప్రారం భోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న ఈ రెండు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో వైద్యసేవల పనితీరుపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామలో సుమారు రూ.154 కోట్ల వ్యయంతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ భ వనం, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. దీంతో ఈ నెల 27న ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను ఆలస్యం చేయకుండా చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాలు, అధికారుల సమన్వయంపై దృష్టి సారించాలని సూచించారు. సమీక్ష సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.


