జనగామ: కార్తీక పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఈనెల 24న (మంగళవారం) జనగామ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు. వర్షం వచ్చే సూచన ఉండడంతో మార్కెట్‌లో అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కవర్ షెడ్‌కు మార్చాలని రైతులకు సూచించారు.
సిద్ధులగుట్టపై తొలిసారి అఖండజ్యోతి
బచ్చన్నపేట : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కొడవటూర్ శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఈనెల 24న (మంగళవారం) పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి కార్తీక దీపోత్సవంలో పాల్గొననున్నారు. ఈసారి నూతనంగా గుట్టపై అఖండ కార్తీక జ్యోతిని సాయంత్రం 6 గంటలకు వెలిగించనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ చిందం వంశీ, ఆలయ కమిటీ చైర్మన్ ఈదుటకంటి వెంకట్‌రెడ్డి తెలిపారు.
ముస్తాబైన సోమేశ్వరాలయం
పాలకుర్తి టౌన్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకు ని క్షీరాద్రి శిఖరమైన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళవారం నిర్వహించే అఖండజ్యోతికి ప్రాంగణాన్ని విద్యుత్ దీపాల వెలుగుతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.
వార్డుసభ్యులకు గుర్తింపేది?
జనగామ రూరల్: గ్రామ పంచాయతీల అభివృద్ధిలో వార్డుసభ్యులు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు, గౌరవం ప్రభుత్వ పరంగా అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర ఫోరం కోశాధికారి చెప్యాల మహిపాల్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ గుండేటి రామచందర్ గౌడ్ అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు నాగబెల్లి జ్యోతి మహేష్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా ఇన్‌చార్జ్ గుండేటి రామచందర్ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..వార్డు సభ్యులకు గౌరవ వేతనం రూ.3వేలు మంజూరు చేయాలన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులు దొంతమల్ల గణేష్ గడ్డం శ్రీనివాస్, నాగబండి సంతోష్, జిల్లా ఆర్గనైజర్ ప్రేమ్ కుమార్ మండలాల ఇన్‌చార్జులు యాకన్న లక్ష్మీనారాయణ, మనోహర్ శ్రీనివాస్ అవినాష్,ప్రశాంత్, వినోద్, పవన్, శ్రీధర్, మహేందర్, శంకర్, హరికృష్ణ, నీలమధు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకలకు రూ.30వేల ఆర్థిక సాయం
జనగామ రూరల్: క్రిస్మస్ వేడుకల కోసం చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎస్.మురళీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలలో సున్నం వేయడానికి విద్యుత్ దీపాలంకరణకు ఆర్థిక సహాయాన్ని మంజురు చేయాలని నిర్ణయించిందన్నారు. జిల్లాలోని అర్హత కలిగిన ప్రతీ చర్చికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించబడుతుందన్నారు. మంగళవారం ఈనెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రింట్‌తో పాటు సంబంధిత జిరాక్స్ పత్రాలు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో 30వ తేదీలోగా అందజేయాలన్నారు. చర్చి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లు, నిర్వహణ కమిటీ తీర్మానం, చర్చి బ్యాంక్ పాస్‌బుక్, క్యాన్సిల్డ్ చెక్ నకలు, చర్చి పాస్టర్, అధ్యక్షులు, కార్యదర్శి ఆధార్ కార్డు, చర్చి ఇటీవలి ఫొటోలు, నిదులను సున్నం వేయడానికి దీపాలంకరణకు మాత్రమే ఉపయోగిస్తామని అండర్ టేకింగ్ పత్రాలు ఉండాలన్నారు.


