పట్టించుకునేవారేరి? | - | Sakshi
Sakshi News home page

పట్టించుకునేవారేరి?

Nov 20 2026 12:55 AM | Updated on Nov 20 2026 12:55 AM

ధాన్యం పోటెత్తుతున్నా..

నిలిచిన కొనుగోళ్లు, మార్కెట్‌లో రైతుల పడిగాపులు

కొనుగోళ్లను పర్యవేక్షించరా..?

మార్కెట్‌లో ఇంత పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నా నిత్యం అందుబాటులో ఉండి కొనుగోళ్లను పర్యవేక్షించాల్సిన కార్యదర్శి, డీఎంఓ కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాత్రి 9 గంటలు దాటితే మార్కెట్‌లో అధికారులు ఎవరూ ఉండటం లేదని రైతులు, హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అడ్తి అసోసియేషన్‌ అధ్యక్షుడు మాశెట్టి వెంకన్న హమాలీల వద్దకు వచ్చి కాంటాలు ప్రారంభించాలని కోరినా వారు అంగీకరించలేదు.

జనగామ: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతోంది. భారీగా ధాన్యం మార్కెట్‌కు చేరుతుండగా, అందుకు అనుగుణంగా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బిడ్డింగ్‌ వేళల్లో ఇష్టారాజ్యం

మార్కెట్‌ నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల వరకు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి, మధ్యాహ్నం 12.30 గంటలలోపు నాణ్యత ఆధారంగా ధర నిర్ణయించాలి. ఈ ప్రక్రియను మధ్యాహ్నం ఒంటి గంటలోపు పూర్తిచేసి వెంటనే కాంటాలు ప్రారంభిస్తే రాత్రి 10 నుంచి 11 గంటల వరకు సుమారు 8వేల నుంచి 10 వేల బస్తాల వరకు కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. బిడ్డింగ్‌ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుండగా, గురువారం ఏకంగా మధ్యాహ్నం 2.30 గంటల వరకు సమయాన్ని పొడిగించడంతో కాంటాలు మరింత ఆలస్యమయ్యాయి.

సర్వర్‌ డౌన్‌.. కరెంటు కోత సాకులా

బిడ్డింగ్‌ ఆలస్యానికి సర్వర్‌ డౌన్‌ కావడం, సుమారు రెండు గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడమే కారణమని మార్కెట్‌ అధికారులు వ్యాపారులు, అడ్తీలు, హమాలీలకు వివరించినట్లు తెలిసింది. మరోవైపు ఈ–నామ్‌ యాప్‌ వ్యాపారుల ఫోన్లలో పనిచేయకపోవడంతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రెండు కంప్యూటర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. మార్కెట్‌లో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నప్పటికీ వైఫై అందుబాటులో లేకపోవడంతో రెండు కంప్యూటర్లకే నెట్‌వర్క్‌ పరిమితమవుతోంది.

అధికారుల హామీతో సద్దుమణిగిన నిరసన

ఈ విషయం తెలుసుకున్న హమాలీల ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ రాజారెడ్డి మార్కెట్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం వస్తుంటే రైతులకు భరోసా ఇచ్చేది ఎవరు, మార్కెట్‌ను పట్టించుకునే అధికారులు ఎక్కడ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంఓకు ఫోన్‌ చేయగా, తాను యాదాద్రి భువనగిరి మార్కెట్‌లో ఉన్నానని, వెంటనే వస్తానని చెప్పారు. గంట తర్వాత మార్కెట్‌కు చేరుకున్న డీఎంఓతో రాజారెడ్డి చర్చించారు. నేడు(శుక్రవారం) ఉదయం 8 గంటలకే కాంటాలు ప్రారంభించాలని, బిడ్డింగ్‌ సమయపాలన పాటించాలని, అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలని కోరారు. మధ్యాహ్నం హమాలీలు, అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన సద్దుమణిగింది.

రైతుల పరిస్థితి ఏంటి?

రెండు రోజులుగా మార్కెట్‌లో ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిడ్డింగ్‌, కాంటాలు, గన్నీబ్యాగుల పంపిణీ, లిఫ్టింగ్‌ వరకు ప్రతి దశకు సమయ పట్టిక రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది.

బిడ్డింగ్‌లో ఇష్టారాజ్యం.. కాంటాలు ఆలస్యం

కాంటాల కోసం హమాలీల

ఎదురుచూపులు

కార్యదర్శి, డీఎంఓ అందుబాటులో

లేకపోవడంపై విమర్శలు

జిల్లా మార్కెట్‌లో

రైతులకు తప్పని పడిగాపులు

అర్ధరాత్రి వరకు కాంటాలు..

బిడ్డింగ్‌ ఆలస్యమైతే దాని ప్రభావం కాంటాలపై పడుతోంది. కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యానికి సకాలంలో కాంటాలు నిర్వహించకపోవడంతో హమాలీలు రాత్రంతా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు గన్నీ బ్యాగుల పంపిణీకి ఒకే ఒక్క వ్యక్తి ఉండటంతో వాటి కోసం కూడా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గురువారం బిడ్డింగ్‌ సమయాన్ని మరోసారి పొడిగించడంతో హమాలీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే మార్కెట్‌లోని మూడు కవర్‌ షెడ్లు, కల్లాలు, కాటన్‌ యార్డులో కలిపి 10 వేలకు పైగా బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, మరో 10 వేలకుపైగా బస్తాలు లిఫ్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత వచ్చిన మరో 15 నుంచి 20 ట్రాక్టర్లు మార్కెట్‌ గేటు బయటే నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement