జనగామ రూరల్: గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే పంచాయతీలకు ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల రూపేణా సమకూరే సొంత ఆదాయాన్ని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకుని స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసుకునేలా చట్టంలో సవరణకు ఆమోదం తెలిపింది. దీంతో ఏళ్ల తరబడి జనరల్ ఫండ్ ఉన్నప్పటికీ నిధుల వినియోగానికి ఇబ్బందులు పడేవారు. నిధుల వినియోగం జీపీలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పల్లెలు అభివృద్ధి దిశగా పయనించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 280 జీపీలకు లబ్ధిచేకూరనుంది.
జనాభా ప్రాతిపాదికన నిధులు
ప్రభుత్వం పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులు కేటాయించనుంది. మండలాల్లోని మేజర్ గ్రామపంచాయతీలకు సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నిధులు అందుతున్నాయి. వీటికి అదనంగా ఇంటి నిర్మాణ అనుమతుల రుసుం, ఆస్తిపన్నులు, వార సంత నిర్వహణ, ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా పంచాయతీలకు సొంత ఆదాయం సమకూరుతుంది. ఇప్పటివరకు ఈ ఆదాయాన్ని నేరుగా ఖర్చు చేసుకునే అవకాశం లేకపోయేది. దీంతో అవసరమైన సమయంలో నిధులు అందుబాటులో లేక పనులు వాయిదా పడేవి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సొంత ఆదాయాన్ని వినియోగించుకునే అవకాశం గ్రామపంచాయతీలకు ఏర్పడింది.
ఫ్రీజింగే ఎక్కువ
గ్రామాల్లో పారుశుద్ధ్య నిర్వహణ, డ్రెయినేజీల మరమ్మతు, వీధిదీపాల ఏర్పాటు, తాగునీటి పైపులైన్ల లీకేజీలకు మరమ్మతు, పంచాయతీ కార్యాలయాలకు స్టేషనరీ కొనుగోలుకు నిత్యం డబ్బులు అవసరమవుతాయి. వీటిలో కొన్ని పనులు అత్యవసరంగా చేపట్టాల్సి ఉంటుంది. గతంలో పంచాయతీలకు పన్నుల రూపంలో ఆదాయం వచ్చినా ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది. గ్రామ అవసరాలకు తిరిగి ఆ నిధులు డ్రా చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇబ్బందులు పడేవారు. జమచేసిన నిదుల తిరిగి పొందాలంటే ఖాతాలు ఫ్రీజ్ అయి ఉండడం, దీంతో నిధులున్నా పనులు చేపట్టలేని పరిస్థితులు ఎదురయ్యేవి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఇకపై ఈ ఇబ్బందులు తగ్గే అవకాశముంది. జీపీలకు చెందిన నిధుల ఖర్చు విషయంలో పాలకవర్గాలకు అధికారం ఇవ్వడంతో గ్రామాల్లో అత్యవసర పనులకు వెంటనే పరిష్కారం లభించనుంది.
జనరల్ ఫండ్ వినియోగం గ్రామపంచాయతీలకే
గతంలో గ్రామ ఆదాయం
ట్రెజరీ ఖాతాల్లో జమ
సొంత ఖాతాల్లో జమ చేసుకునేందుకు
అవకాశం ఇచ్చిన ప్రభుత్వం
ఆర్థిక వెసులుబాటుతో
సమగ్రాభివృద్ధికి తోడ్పాటు


