జనగామ: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గోరుముద్ద (బ్రేక్‌ఫాస్ట్) కార్యక్రమం రెండో విడతకు జిల్లా ఎంపికై ంది. ఈ విషయాన్ని ఇటీవల మంత్రి సీతక్క ప్రకటించడంతో జిల్లాలో కార్యక్రమం అమలుకు మార్గం సుగమమైంది. జిల్లాలోని 695 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో వేలాది మంది లబ్ధిదారులకు ఉదయం అల్పాహారం అందనుంది.
ఐదు కేటగిరీల్లో 29,692 మంది
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 2,571 మంది గర్భిణులు, 2,063 మంది బాలింతలు, ఆరు నెలలలోపు చిన్నారులు 2,148 మంది, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 11,544 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 11,366 మంది ఉన్నారు. మొత్తంగా ఐదు విభాగాల్లో 29,692 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పౌష్టికాహారం అందించడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.
ఉదయం అల్పాహారం..
గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య పిల్లలకు అల్పాహారం అందించనున్నారు. ఇందులో ఉప్మా, కిచిడీ తదితర పౌష్టికాహార పదార్థాలు ఉండనున్నాయి. ఇందుకు అవసరమైన సరుకులను ప్రభుత్వం ప్రత్యేక ప్యాకెట్ల రూపంలో సరఫరా చేయనుంది. వాటిని ఏ విధంగా సిద్ధం చేయాలి, పిల్లలకు ఎలా అందించాలనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు.
టీచర్లు, ఆయాలకు ప్రత్యేక శిక్షణ
రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఫుడ్స్ తయారీ ప్రతినిధులు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు డెమో నిర్వహించి అల్పాహార తయారీ, పంపిణీ విధానంపై వివరించారు. అయితే జిల్లాకు రెండో విడతలో చోటు లభించిన నేపథ్యంలో బ్రేక్‌ఫాస్ట్‌కు సంబంధించిన సరుకులు ఎప్పుడు సరఫరా చేస్తారు, కార్యక్రమాన్ని ఏ తేదీ నుంచి ప్రారంభిస్తారు అనే విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలోని 695 కేంద్రాల్లో గోరుముద్ద కార్యక్రమం ప్రారంభం కానుంది.
695అంగన్‌వాడీ కేంద్రాల్లో
అమలుకు సన్నాహాలు
బ్రేక్‌ఫాస్ట్‌పై టీచర్లు, ఆయాలకు
ప్రత్యేక అవగాహన


