‘ఆరుతడి’కే ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

‘ఆరుతడి’కే ప్రోత్సాహం

Nov 16 2026 12:56 AM | Updated on Nov 16 2026 12:56 AM

జనగామ: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశాల నేపథ్యంలో యాసంగి సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వరి సాగుతో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయంగా ఆరుతడి, తక్కువ నీటితో పండించే పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాల వారీగా రైతుల ఆసక్తి, పంటల రకాలు, సాగు విస్తీర్ణం, నీటి వనరులు, వ్యవసాయ అవసరాలను సేకరించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఈఓ లు రెండు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతుల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

పంటల మార్పిడికి ప్రాధాన్యం

యాసంగి కార్యాచరణ ప్రణాళికను ఈ నెల 19వ తేదీలోగా రూపొందించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. గ్రామాల వారీగా ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారనే వివరాలను సేకరించి జిల్లా స్థాయి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. కుసుమ, టమాటా, బీరకాయ, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటల సాగుపై రైతుల ఆసక్తిని నమోదు చేయనున్నారు.

యాప్‌లో వ్యవసాయ అవసరాల నమోదు

ఏఈఓలు తమ లాగిన్‌ ద్వారా రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రైతులు తమ గ్రామ క్లస్టర్‌ ఏఈఓలను సంప్రదించి ఆసక్తి ఉన్న పంట లు, సాగు విస్తీర్ణంతో పాటు డ్రిప్‌, స్ప్రింక్లర్లు, ప్రెజర్‌గన్స్‌, సోలార్‌ ఫెన్సింగ్‌, పశుగ్రాస విత్తనాలు, మినీ ట్రాక్టర్ల అవసరాలను నమోదు చేయించుకోవాలి. ఒకే ప్రాంతంలో 25 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు సమూహంగా ముందుకొస్తే సోలార్‌ ఫెన్సింగ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రోత్సహించనున్నారు. రైతులు ఈనెల 16 (సోమవారం)సాయంత్రంలోగా వివరాలు నమోదు చేయించుకోవాలి.

ఉద్యాన, ఆధునిక సాగు పద్ధతులకు ప్రోత్సాహం

కూరగాయలు, టమాట, మిరప, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, కలబంద వంటి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించనున్నారు. ఒక మీటరు కంటే తక్కువ ఎత్తు పెరిగే పంటలకు స్ప్రింక్లర్‌ విధానంలో నీటి పారుదల సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొక్కజొన్న, పప్పుధాన్యాల జీరో టిల్లేజ్‌ సాగు, డ్రిప్‌తో పసుపు, అల్లం, మిరప సాగు, పొద్దు తిరుగుడుకు డ్రిప్‌తో పాటు సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుపైనా దృష్టి సారించనున్నారు. కోతులు, ఇతర వన్యప్రాణుల బెడద నుంచి పంటలను రక్షించేందుకు రైతుల బృందాలకు సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకునేలా సహకరించనున్నారు. నేపియర్‌ గడ్డి, పశుగ్రాస జొన్న, మొక్కజొన్న విత్తనాల అవసరాలతో పాటు మినీ ట్రాక్టర్ల వివరాలనూ సేకరించనున్నారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ

రైతుల ఆసక్తి, సాగు విస్తీర్ణం,

వ్యవసాయ అవసరాల నమోదుకు

ప్రత్యేక యాప్‌

సోలార్‌ ఫెన్సింగ్‌, డ్రిప్‌, స్ప్రింక్లర్లు,

మినీ ట్రాక్టర్లకూ అవకాశం

సాగు ప్రణాళిక వివరాలు

పంటల సాగు ఆరుతడి పంటలు

వరి సాగు యాసంగిలో వద్దు

నివేదిక రెండు రోజుల్లో సమర్పణ

కార్యాచరణ ఈ నెల19లోగా

రైతుల నమోదు ప్రత్యేక ఆన్‌లైన్‌ యాప్‌

ప్రత్యామ్నాయ పెసర, మినుము, శనగ,

పంటలు కూరగాయలు

సోలార్‌ ఫెన్సింగ్‌ 25 ఎకరాల క్లస్టర్‌

చివరి గడువు ఈ నెల 16 సాయంత్రం

పరికరాలు డ్రిప్‌, స్ప్రింక్లర్లు, మినీ ట్రాక్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement