సీఎంఆర్‌ గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ గోల్‌మాల్‌

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

జనగామ: రాష్ట్రవ్యాప్తంగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పౌరసరఫరాల శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేపడుతూ అక్రమాలకు పాల్పడిన మిల్లులపై కేసులు నమోదు చేయడంతోపాటు వాటిని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోనూ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో పాలకుర్తి, లింగాలఘణపురం, నర్మెట మండలాల్లోని మూడు రైస్‌ మిల్లుల్లో సుమారు రూ.18 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపుతోంది. సంబంధిత మిల్లులను సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించగా, మరికొందరు బెయిల్‌పై ఉన్నట్లు సమాచారం.

మిల్లులవారీగా భారీ వ్యత్యాసాలు

పాలకుర్తి మండలంలోని అన్నపూర్ణ రైస్‌ మిల్లులో రూ.8.24 కోట్లకుపైగా విలువైన ధాన్యాన్ని యజమాని రాజేష్‌ అక్రమంగా పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. 2022–23 సంవత్సరానికి సంబంధించిన 2,998 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ప్రభుత్వానికి బియ్యం అప్పగించాల్సి ఉండగా, పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. గత సెప్టెంబర్‌ 13న పౌరసరఫరాల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, 25 రోజుల తర్వాత కేసు నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజేష్‌ ముందస్తు బెయిల్‌ పొందినట్లు తెలిసింది. ప్రస్తుతం మిల్లు ప్రభుత్వ ఆధీనంలో సీజ్‌ చేసి ఉంది. లింగాలఘణపురం మండలం నెల్లుట్ల సమీపంలోని మణికంఠ రైస్‌ మిల్లులోనూ భారీగా సీఎంఆర్‌ ధాన్యం బకాయిలు ఉన్నట్లు గుర్తించారు. గతంలోనే మూతపడిన ఈ మిల్లుకు సంబంధించి సుమారు రూ.3.8 కోట్లకుపైగా విలువైన ధాన్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించలేదనే ఆరోపణలపై 11మందిపై కేసులు నమోదయ్యాయి. 2022–23లో 1,526.970 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి బియ్యం అప్పగించకుండా అక్రమాలకు పాల్ప డినట్లు గుర్తించిన అధికారులు 2025లో అదనపు కలెక్టర్‌ ద్వారా నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ 2023–24లోనూ అదే మిల్లుకు సీఎంఆర్‌ ధాన్యం కేటాయించడం, తిరిగి బియ్యం అప్పగించకుండా ప్రైవేట్‌గా విక్రయించినట్లు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రాథమికంగా సుమారు రూ.5 కోట్ల మేర నష్టం జరిగినట్లు నిర్ధారించినట్లు సమాచారం. నూనె వెంకటేశ్వర్లును గత ఆగస్టులో అరెస్టు చేసి రిమాండ్‌ తరలించారు. ధాన్యం రికవరీ కోసం మిల్లును తహసీల్దార్‌కు అప్పగించారు. నర్మెట మండలంలోని జై భవాని ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ మిల్లులోనూ సీఎంఆర్‌ ధాన్యం భారీగా తక్కువైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 5,421.920 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సరఫరా చేయగా, 2,107.384 మెట్రిక్‌ టన్నులు తక్కువగా ఉన్నట్లు లెక్కించారు. దీని విలువ రూ.5,75,36,323గా నిర్ధారించారు. ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు కాగా, ఇద్దరు ప్రస్తుతం జిల్లా జైలులో ఉన్నట్లు, మరో ఇద్దరు బెయిల్‌పై ఉన్నట్లు తెలిసింది. కేసు ఫైల్‌ జనగామ ఏసీపీ కార్యాలయంలో ఉందని సంబంధిత ఎస్‌ఐ తెలిపారు. మిల్లును వేలం వేయడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

రూ.18 కోట్లకుపైగా విలువైన ధాన్యం పక్కదారి

జిల్లాలో మూడు రైస్‌ మిల్లుల

యజమానులపై కేసులు

మిల్లుల సీజ్‌, రికవరీ చర్యలు

గత అధికారుల నిఘాపై అనుమానాలు

పాలకుర్తిలో ఫిర్యాదు తర్వాత కేసు నమోదులో జాప్యంపై చర్చ

మిల్లుల్లో ఇంత భారీగా ధాన్యం తక్కువగా ఉన్నప్పటికీ గతంలో పర్యవేక్షించిన అధికారులు ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలోనే అక్రమాలను గుర్తించి ఉంటే ప్రభుత్వానికి నష్టం తగ్గేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లులకు గతంలో సన్నబియ్యం కేటాయించారా.. దొడ్డుబియ్యం కేటాయించారా.. కేటాయించిన ధాన్యానికి అనుగుణంగా బియ్యం సరఫరా చేశారా..అనే కోణంలోనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ జిల్లాకు చెందిన మణికంఠ మిల్లు యజమానులపై అక్కడా ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ జనగామ మిల్లుపై ముందుగానే నిఘా పెట్టకపోవడంపై చర్చ జరుగుతోంది. ప్రస్తు తం ప్రధాన ప్రశ్న ధాన్యం నష్టాన్ని ఎలా రికవరీ చేస్తారు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదే. మిల్లుల సీజ్‌, వేలం, రెవెన్యూ రికవరీ చట్టం అమలు ద్వారా ప్రభుత్వ సొమ్మును తిరిగి రాబట్టే ప్రక్రియ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement