అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

జనగామ: ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజల అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశం హాలులో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌ షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై వచ్చిన 375 అర్జీలను స్వీకరించి, వాటిని పరిశీలించారు. అనంతరం దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బలరామరావు, డీఆర్డీఓ భాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, సీపీఓ చిన కోట్యా నాయక్‌, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దుకాణం అనుమతి రద్దు చేశారు..

జనగామ పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన బెలిదె శైలజ తనకు జిరాక్స్‌, ఇంటర్నెట్‌ దుకాణం ఉందని, అందులో పాస్‌పోర్టు ఫొటోలు తీసేందుకు ఒక యూనిట్‌కు రూ.12వేలు చెల్లించి అనుమతి పొందానని తెలిపారు. అయితే వారం రోజులకే ఆ అనుమతిని రద్దు చేసి డబ్బులు తిరిగి ఇచ్చారని, ప్రస్తుతం తన దుకాణం ఎదుటకు వచ్చి గొడవ చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు రుణంతో దుకాణం నిర్వహిస్తున్నందున తన సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

దరఖాస్తుల్లో కొన్ని ఇలా..

బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి చెందిన మల్లం శ్రీహరి తనకు వంశపారంపర్యంగా సంక్రమించిన పది గుంటల భూమి రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేర్లతో నమోదైందని, ఆ పేర్లను తొలగించి తమ పేరున నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పాలకుర్తి మండలం వల్మిడి గ్రామానికి చెందిన చెరుకు చిన్న రాములు తన రెండు ఎకరాల భూమికి పట్టా మంజూరు చేయాలని కోరారు.

తరిగొప్పుల మండలం బొత్తలపర్రె గ్రామానికి చెందిన ఎం.భద్రమ్మ తన ఇల్లు కూలిపోయే స్థితిలో ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు అందజేశారు.

జఫర్‌గఢ్‌ మండలం తిడుగు గ్రామానికి చెందిన కడారి యాదగిరి తన 18 గుంటల భూమి రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరున తప్పుగా నమోదైందని, ఆ పేరును తొలగించి తన పేరు మీద పట్టా పాసుపుస్తకంలో నమోదు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

సత్వర పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

అధికారులకు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశం

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో 375 అర్జీల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement