జనగామ: జిల్లా వ్యవసాయ మార్కెట్‌కు 15 ఏళ్ల తర్వాత సోమవారం రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. వచ్చే సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే ఆందోళనల నేపథ్యంలో ధాన్యానికి డిమాండ్ పెరగడం, మార్కెట్‌లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు భారీగా ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ధాన్యంలో తేమ శాతం 30 నుంచి 50 వరకు ఉన్నప్పటికీ క్వింటాల్‌కు రూ.1,800 నుంచి రూ.2,400కుపైగా ధర పలుకుతుండటం గమనార్హం.
ఒక్కరోజే వేల క్వింటాళ్ల కొనుగోలు
ఒక్కరోజే మార్కెట్‌లో 17,678 క్వింటాళ్ల దొడ్డు రకం ధాన్యం, 560 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దొడ్డురకం ధాన్యం 343 మంది రైతుల నుంచి 27,197 బస్తాలు కొనుగోలు చేయగా, క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,407, కనిష్టంగా రూ.1,807, సగటు ధర రూ.2,316 పలికింది. సన్నరకం ధాన్యానికి గరిష్టంగా రూ.2,869, కనిష్ఠంగా రూ.2,669, సగటున రూ.2,866 ధర లభించింది. ఇదిలా ఉండగా సుమారు 80 మంది రైతులు ధర ఆశించిన మేర రాలేదని 5వేల బస్తాలకు పైగా బిడ్డింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు.
మక్కలకు సైతం రికార్డు ధరలు
మార్కెట్‌లో మక్కలకు కూడా మంచి ధర లభిస్తోంది. సోమవారం 33 మంది రైతుల నుంచి 771 క్వింటాళ్ల మక్కలను, 1,403 బస్తాలను కొనుగోలు చేశా రు. క్వింటాలుకు గరిష్టంగా రూ.2,957, కనిష్టంగా రూ.2,411, సగటు ధర రూ.2, 777 పలికింది.
నిల్వకు స్థలం కరువు..
మార్కెట్‌కు భారీగా ధాన్యం తరలిరావడంతో మూడు కవర్ షెడ్లు, కల్లాలు, పత్తి యార్డు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం మరో 10 వేల నుంచి 20 వేల బస్తాల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండగా, నేడు(మంగళవారం)మరో 20 వేల నుంచి 30 వేల బస్తాలు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో ధాన్యం నిల్వ, కొనుగోళ్లు, రవాణా నిర్వహణ అధికారులకు సవాలుగా మారాయి. సోమవారం ఇంటర్నెట్ వైర్లు తెగిపోవడంతో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా బిడ్డింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు ఆలస్యమైంది. దీంతో హమాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. కాంటాలు, లారీ లోడింగ్ పూర్తయ్యే సరికి అర్ధరాత్రి దాటిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడటంతో సమస్య తీవ్రత తగ్గింది. కొనుగోళ్ల జాప్యంపై రైతులు సైతం అసహనం వ్యక్తం చేశారు.
15 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో
మార్కెట్‌కు రాక
మద్దతు ధరకు మించి పలుకుతున్న ధరలు
కిక్కిరిసిన కవర్ షెడ్లు, కల్లాలు
కొనుగోళ్ల జాప్యంతో రైతులు,
హమాలీల ఇక్కట్లు


