● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం జనగామ నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని మండలాల్లో, ముఖ్యంగా నర్మెట, తరిగొప్పుల, మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఓటరు నమోదు పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జనగామ పట్టణంలో ప్రతీ ఐదు వార్డులకు ఒక కమిటీ చొప్పున ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంతో పాటు అన్ని మండలాల్లోనూ నాయకులు, సమన్వయకర్తలు బాధ్యతగా వ్యవహరించి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఇన్‌చార్జ్ బండ శ్రీనివాస్ నేటి(సోమవారం) నుంచి అ న్ని ప్రాంతాల ఇన్‌చార్జులు, పట్టణ నాయకులు, ఇతర ప్రాంతాల నాయకులను కలిసి అవసరమైన సమాచారం అందిస్తూ సమన్వయం చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు.


