ఎండు గడ్డి ధరలు భగ్గు | - | Sakshi
Sakshi News home page

ఎండు గడ్డి ధరలు భగ్గు

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

జనగామ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉండటంతో జిల్లాలో పశుగ్రాసం కొర త ఏర్పడుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. పశుసంవర్ధక శాఖ అధికారులు కొరత ఉండదని చెబుతున్నప్పటికీ, పెరుగుతున్న ఎండు గడ్డి ధరలు పాడి రైతులను కలవరపెడుతున్నాయి. గతంలో 30 కిలోల ఎండు గడ్డి కట్ట రూ.80 ఉండగా, ప్రస్తుతం రూ.110కు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ధర రూ.150 నుంచి రూ.160 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో గడ్డికి డిమాండ్‌ పెరిగింది. రానున్న యాసంగి సీజన్‌లో వరి సాగు ఉంటుందా లేదా అన్న అనిశ్చితితో రైతులు ముందుగానే గడ్డిని కొనుగోలు చేసి నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

తగ్గుతున్న పాల దిగుబడి

మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోజువారీ పాల దిగుబడి 10 నుంచి 15 శాతం తగ్గినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చిగడ్డి అందుబాటులో లేకపోతే పశువుల పోషణ మరింత భారమవుతుందని చెబుతున్నారు. పశుగ్రాసం, దాణా ధరలు పెరిగితే పాల ఉత్పత్తి వ్యయం అధికమై, పాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. పాడి పరిశ్రమపైనే ఆధారపడిన కుటుంబాల జీవనోపాధిపై దీని ప్రభావం పడనుంది. ఇటీవల కురిసిన వర్షాలతో అటవీ ప్రాంతాల్లో కొంత గడ్డి పెరగడం ఊరటనిచ్చినా, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అది ఎండిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. పశుసంవర్ధక, వ్యవసాయ శాఖల సమన్వయంతో శిఖం భూముల్లో పశుగ్రాసం పెంపకంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముందస్తు ప్రణా ళికలు, ప్రత్యామ్నాయ పశుగ్రాస ఏర్పాట్లతోనే రైతుల ఆందోళనకు పరిష్కారం లభించనుంది.

జనగామ మండలం శామీర్‌పేటకు చెందిన పాడి రైతు గద్ద భిక్షపతి వ్యవసాయానికి అనుబంధంగా 10 పాడి గేదెలను పెంచుతున్నారు. ఆరు నెలల క్రితం రోజుకు 26 లీటర్ల పాల ఉత్పత్తి ఉండగా, ప్రస్తుతం 20 లీటర్లకు తగ్గింది. లీటరు పాలను రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో రూ.80కు లభించిన 30 కిలోల గడ్డి కట్ట ధర ప్రస్తుతం రూ.110కి పెరిగింది. తన 10 గుంటల్లో పచ్చిగడ్డి సాగు చేస్తూ నెలకు రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు.

యాసంగిలో వరి సాగుపై అనిశ్చితి..

పశుగ్రాసంపై ఆందోళన

తగ్గిన పాల దిగుబడి.. పడిపోనున్న ఆదాయం

భారం కానున్న పాడి పశువుల పోషణ

కొరత ఉండదంటున్న అధికారులు

ఎల్‌నినో ప్రభావంతో ఇక్కట్లు

పాడి గేదెలు, ఆవుల సంఖ్య: 1.50 లక్షలు

పశుగ్రాస డిమాండ్‌: 4.50 మెట్రిక్‌ టన్నులు

అంచనా సరఫరా: 4.90 మెట్రిక్‌ టన్నులు

ఎండు గడ్డి కట్ట(30 కిలోలు):

ప్రస్తుతం రూ.110

గతంలో ధర: రూ.80

అంచనా ధర: రూ.150–160

పాల దిగుబడి తగ్గుదల: 10–15 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement