రేపు చిల్పూరు హుండీ లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

రేపు చిల్పూరు హుండీ లెక్కింపు

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

చిల్పూరు: చిల్పూరు గుట్ట శ్రీబుగులు వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు ఈనెల 27న నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీప్రసన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ హుండీల లెక్కింపు ఉంటుందని, భక్తులు గమనించాలని కోరారు.

జాతీయస్థాయి క్రీడాకారిణి అమూల్యకు సన్మానం

జఫర్‌గఢ్‌: మండలంలోని కూనూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి బుల్లె అమూల్యను గ్రామస్తులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ అంతరాష్ట్ర బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొని రాష్ట్ర జట్టుకు విద్యార్థిని అమూల్య ప్రాతినిధ్యం వహించింది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించడంపై క్రీడా పోషకులు పోతోజు ఎల్లాచారి, చేగొండ రమేశ్‌, శాస్త్రబోయిన సంపత్‌తో పాటు గ్రామస్తులు అమూల్యను ఆమె నివాసంలో శాలువాలతో సత్కరించారు. రానున్న రోజుల్లో మరిన్ని క్రీడాపోటీల్లో పాల్గొని ఉత్తమ క్రీడాకారిణిగా ఎదగాలని వారు కోరారు.

భక్తులతో కిక్కిరిసిన హేమాచలక్షేత్రం

మంగపేట : మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, అనిపెద్ది రాజీవ్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, వెంకటనారాయణ శర్మ ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించిన తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారికి నువ్వుల నూనె, పూల దండలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. మానవ శరీరాన్ని పోలి ఉన్న స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పూజారులు స్వామి వారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం భక్తులకు వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. డీఆర్‌ఓ దంపతుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి శేష వస్త్రాలను బహుకరించి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట జీపీఓ రాములు. నర్సయ్య ఉన్నారు.

మేడారంలో

సండే సందడి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ వనదేవతలు కొలువైన మేడారంలో ముందస్తు జాతర సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ప్రైవేటు వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో గద్దెల ప్రాంగణం సందడిగా కనిపించింది. సుమారుగా 30వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గద్దెల వద్ద భక్తుల భద్రతకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

గద్దెల వద్ద ప్రత్యేక పూజలు

మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవార్లకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని వనదేవతలను వేడుకున్నారు. అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో చెట్ల కింద విడిది చేశారు. వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించి ఆనందంగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement