పొదుపుగా వాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

పొదుపుగా వాడుకుందాం

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

జనగామ: వాతావరణ మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావం వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపితే ఎండలతీవ్రత పెరిగి జలవనరులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. వర్షాలు సకాలంలో కురవకపోతే చెరువులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గడంతో పాటు భూగర్భ జలాల పునరుద్ధరణకు ఆటంకం ఏర్పడవచ్చు. ఈ పరిస్థితులు తాగునీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రతిఒక్కరూ ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటి వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తు అవసరాలకు భద్రపరచాలి. ప్రతి నీటి బొట్టును విలువైన వనరుగా భావించి వృథాను అరికట్టినప్పుడే రేపటి నీటి అవసరాలకు భరోసా లభిస్తుంది.

మున్సిపల్‌ ప్రత్యేక కార్యాచరణ

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో తీవ్ర ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో జనగామ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్‌ అధికారులు ముందస్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. పట్టణ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ రెండు నుంచి రెండున్నర గంటల పాటు నల్లాల ద్వారా నీటి సరఫరా చేస్తుండగా, ఇదే విధానాన్ని భవిష్యత్‌లోనూ కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు.

ఏడాది పాటు నీటి సరఫరాకు అవకాశం

జనగామ పట్టణంలో 30 వార్డులు ఉండగా, సుమారు 70 నుంచి 75 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి చీటకోడూరు డ్యామ్‌ నుంచి శుద్ధి చేసిన నీటితో పాటు మిషన్‌ భగీరథ నీటిని అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. చీటకోడూరు ఫిల్ట ర్‌ బెడ్‌ ద్వారా రోజుకు 11 ఎంఎల్‌డీ, మిషన్‌ భగీరథ నుంచి మరో 1 ఎంఎల్‌డీ చొప్పున మొత్తం 12 ఎంఎల్‌డీ నీటిని అందిస్తున్నారు. పట్టణ పరిధిలోని సుమారు 12,900 నల్లాల ద్వారా ప్రజలకు తాగునీరు చేరుతోంది. చీటకోడూరు డ్యామ్‌లో 389 ఎంసీఎఫ్‌టీ నీరుకు గాను, ప్రస్తు తం 228 ఎంసీఎఫ్‌టీ నీరు నిల్వ ఉంది. ఈ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగిస్తే మరో ఏడాది పాటు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే నీటిలో కొంత భాగాన్ని సాగునీటికి మళ్లిస్తే ఆరు నెలల్లోనే తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో సాగునీటి అవసరాలకు చీటకోడూరు నీటిని వినియోగించవద్దని మున్సి పల్‌ అధికారులు ఇరిగేషన్‌ శాఖకు లేఖలు రాశారు. సాగు నీటికి నీటిని మళ్లించే అవకాశం లేదని ఇరిగేషన్‌ డీఈ మన్మధరావు సైతం పేర్కొన్నారు.

వర్షాలపైనే అదనపు నీటి ఆశలు

చీటకోడూరు డ్యామ్‌కు అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ నుంచి దేవాదుల ప్రాజెక్టు నీరు చేరాల్సి ఉంటుంది. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండితే కాల్వల ద్వారా చీటకోడూరుకు అదనపు నీటిని మళ్లించే అవకాశం ఉంటుంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాలమణి శ్రీనివాస్‌, కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

చీటకోడూరు డ్యాంలో 228 ఎంసీఎఫ్‌టీ నీరు

ఎల్‌నినో ఎఫెక్ట్‌ ఉన్నా.. ఏడాది పాటు తాగునీటికి ఢోకాలేదు

సాగునీటికి మళ్లిస్తే ఇబ్బందే..

ఇరిగేషన్‌ శాఖకు మున్సిపల్‌ లేఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement