జనగామ రూరల్: ఎల్‌నినో ప్రభావంతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీటి సంరక్షణ ఒక్కటే మార్గం కాగా గ్రామాల్లో పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. వీబీ జీరామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ అజీవక మిషన్ గ్రామీణ) కింద నీటి సంరక్షణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా నీటి కుంటలు(ఫాంపాండ్స్), ఇంకుడు గుంతలు (సోక్ పిట్స్), సామూహిక ఇంకుడు గుంతలు, పెర్కోలేషన్ ట్యాంకులు,(ఊట చెరువులు), సామూహిక నీటి నిల్వ కుంట(కమ్యూనిటీ హార్వెస్ట్ పాండ్), బోర్‌వెల్ రీచార్జ్, ఓపెన్ వెల్ నిర్మాణాలు, రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ (ఇంటి పైకప్పు నుంచి కిందపడే వర్షపు నీటిని సేకరించే విధానం) నిర్మాణ పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి.
కలెక్టర్ దిశానిర్దేశం..
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నీటి పొదుపుపై విస్తృత అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రభావం పడనుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువై యాసంగి సీజన్‌లో భూగర్భ జలాలు మరింత అడుగంటే ప్రమాదం పొంచి ఉంది. ఇందుకు నీటిబొట్టును ఒడిసిపట్టి నీటినిల్వలు పెంచుకోవడానికి అవగాహన కల్పిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు.
ప్రయోజనాలు ఇలా..
వ్యవసాయ పొలాల్లో ఫాంపాండ్స్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. వర్షాభావంలో నీటి కొరతను నివారిస్తుంది. అలాగే గ్రామ పరిసరాల్లో పెర్కోలేషన్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి అవుతాయి. ఇళ్లలో వినియోగించిన నీటిని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి, భూగర్భ జలాలు పెరిగేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగ పడతాయి. వీటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బోర్‌వెల్ చుట్టూ గుంతలు తీసి, నిర్మాణం చేయడం వల్ల వర్షపు నీరు బోర్‌వెల్ లోపలికి వెళ్లి రీచార్జి చేస్తుంది. ఓపెన్ వెల్ చుట్టూ నిర్మాణం చేయడం వల్ల భూగర్భజలమట్టం పెరుగుతుంది. ఇలా నీటి సంరక్షణ పనులతో సాగు, తాగునీటి కొరతను అధిగమించవచ్చు.
నీటి పొదుపు అవసరం
రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రరూపం దాల్చనుంది. ఓ వైపు కొత్త బావులు, బోర్ల తవ్వకం, మరో పక్క పాత వాటిని ఫ్లషింగ్(లోతు పెంచడం)పై ప్రజలు దృష్టి పెట్టాల్సి ఉంది. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు నీటి అవసరం లేకుండా గడిచే పరిస్థితి లేదు. ప్రతీ పనిలో పొదుపు పాటిస్తే 20–30 శాతం నీరు ఆదా చేసినట్లే అవుతుంది. పట్టణ ప్రజలు వృథా నీటిని ఒడిసిపట్టాలి. అందుబాటులో ఉన్న అరకొర నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి. షవర్‌తో స్నానం, పైపుతో వాహనాలు కడగడం, ఇల్లు కడగడం వల్ల ఎక్కువ నీరు వృథా అవుతుంది. ప్రత్యామ్నయ మార్గాలను అనుసరించాలి.
ఫాంపాండ్స్
964
పాలకుర్తిలో ఫాంపాండ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సోక్‌పిట్స్
3518
సామూహిక నీటి నిల్వ కుంటలు: 260
సామూహిక ఇంకుడు గుంతలు: 582
ఇంటి పైకప్పు నుంచి వర్షపు నీటి సేకరణ: 41
నీటి సంరక్షణ పనులకు ప్రభుత్వ
ప్రాధాన్యం
జలసిరికి ఇంకుడు గుంతలు,
నీటికుంటలు కీలకం
జిల్లాలో వీబీ జీరామ్‌జీ ద్వారా
ముమ్మరంగా నిర్మాణం
పనుల పురోగతిపై కలెక్టర్ ప్రత్యేక చొరవ
నీటి సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
ఎల్‌నినో పరిస్థితితుల దృష్ట్యా వీబీ జీరామ్‌జీ పనుల కింద నీటి సంరక్షణ ప్రత్యేక చర్యలు చేపట్టాం. నీటి సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా బావించాలి. నీటి రక్షణ, పొదుపుగా వాడుకునేందుకు జిల్లాలో అనువైన చోట్ల మ్యాజిక్ సోక్ పిట్స్, చెక్‌డ్యాంలు, సామూహిక ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్, బోర్‌వెల్ రీచార్జ్‌లు చేపట్టేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తున్నాం. ప్రతీ ఒక రైతు ఫాంపాండ్ నిర్మించుకుని భవిష్యత్ తరాలకు నీటిని అందించాలి.
–సందీప్ కుమార్ ఝా, కలెక్టర్
అవగాహన కల్పిస్తున్నాం..
వీబీ జీరామ్‌జీ పథకం కింద గ్రామాల్లో నీటి నిల్వ ఉండేలా రైతులు తమ ఖాళీ స్థలాల్లో ఫాంపాండ్స్ నిర్మించుకోవడంపై అవగాహన కల్పిస్తున్నాం. లక్ష్యాలను చేరుకోనేలా కృషి చేస్తున్నాం. జల సంరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలి.
–భాస్కర్, డీఆర్‌డీఓ
వీబీ జీరామ్‌జీ కింద నీటి సంరక్షణ పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూగర్భజలాలు పెంపొందించుకోవడానికి పలు రకాల పద్ధతులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్ (నీటి కుంటలు), పెర్కోలేషన్ ట్యాంక్స్, బోర్‌వెల్ రీచార్జి, ఓపెన్ వెల్స్ నిర్మాణాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ముందుగా ప్రతిపాదనలు రూపొందించి, మంజూరు అనంతరం నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే కలెక్టర్ ప్రత్యేక సమీక్షల ద్వారా పనుల పురోగతి తెలుసుకుంటూ, నిర్మాణాలు వేగవంతమయ్యేలా సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచనలు అందజేస్తున్నారు.


