జనగామ: దసరా పండుగను పురస్కరించుకుని జనగామ ఆర్టీసీ డిపో నడిపించిన ప్రత్యేక, రెగ్యులర్ బస్సు సర్వీసులతో సంస్థకు గణనీయమైన ఆదాయం సమకూరింది. ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు వివిధ ఆయా రూట్లలో బస్సులను నడిపించారు. స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణం కావడంతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రెగ్యులర్, అదనపు సర్వీసులను అందుబాటులో ఉంచారు.
13రోజులు.. 1,290 ట్రిప్పులు
ఆర్టీసీ లెక్కల ప్రకారం పండుగ సీజన్ 13 రోజుల్లో డిపో పరిధిలో మొత్తం 1,290 ట్రిప్పుల బస్సు సర్వీసులు నడిచాయి. వీటి ద్వారా 5,67,907 కిలోమీటర్ల మేర బస్సులు ప్రయాణించాయి. ఇందుకుగాను సంస్థకు రూ.2, 84,70,850 నికర ఆదాయం సమకూరింది. ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా రూ. కోటి 81లక్షలు, పురుష ప్రయాణికుల ద్వారా రూ. కోటి 2 లక్షల లాదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 6,19,858మంది ప్రయాణించగా, వారిలో మహిళలు 4,27,305 మంది, పురుషులు 1,92,553 మంది ఉన్నారు. పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగించుకున్నట్లు ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా
పండుగ రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో బస్సుల సంఖ్యతో పాటు ఆదాయం, ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నెల 12న అత్యధికంగా 60,256 మంది ప్రయాణించగా, 22న రూ.27.25 లక్షలతో అత్యధిక రోజువారీ ఆదాయం నమోదైంది. 16న అత్యధికంగా 110 బస్సులు నడిచాయి. 20న 56 బస్సులు మాత్రమే నడవడంతో ఆ రోజు ఆదాయం రూ.9.55 లక్షలుగా నమోదైంది. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపడం ద్వారా ఆర్టీసీ డిపో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు సంస్థ ఆదాయాన్ని పెంచుకుంది. మహిళలు, పురుషులు కలిపి ఆరు లక్షల మందికి పైగా ప్రయాణించడం ఆర్టీసీ బస్సులకు ఉన్న ఆదరణను తెలియ జేస్తోంది.
13 రోజుల్లో 6.19 లక్షల మంది ప్రయాణం
మహిళలే 4.27 లక్షల మంది
ఆర్టీసీ ఆదాయంలో మహిళల వాటా రూ.1.81 కోట్లు
ఈ నెల 22న రూ.27.25 లక్షల ఆదాయం నమోదు


