జనగామ: దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా స్వగ్రామాలకు వచ్చిన కుటుంబ సభ్యులు, విద్యార్థులు, యువకులు తిరుగు ప్రయాణం కావడంతో జనగామ బస్టాండు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. గురువారం పట్టణంతో పాటు ఆయా మండలాల పరిధిలోని బస్టాపుల్లోనూ రద్దీ నెలకొంది. పండుగ సెలవులు ముగియడంతో హైదరాబాద్, ఉప్పల్, జగద్గిరిగుట్ట తదితర ప్రాం తాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఆయా రూట్లలో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించాయి. సూర్యాపేట, హనుమకొండ, సిద్దిపేట తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ రద్దీ కొనసాగింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడుపుతున్నప్పటికీ, ఒకేసారి భారీసంఖ్యలో ప్రయాణికులు బయలుదేరడంతో బస్సుల కోసం గంటకుపైగా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైలు ప్రయాణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.


