అంబరాన్నంటిన సంబురాలు | - | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన సంబురాలు

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు

బతుకమ్మకుంటలో రావణవధ సందర్భంగా బాణసంచా వెలుగులు

జనగామ: జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆలయాలతో పాటు జమ్మి చెట్టు పూజలు, పాలపిట్ట దర్శనాలతో జిల్లా వ్యాప్తంగా పండుగ సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో నిర్వహించిన జమ్మి పూజలు, రావణ వధ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జమ్మి ఆకులను బంగారానికి ప్రతీకగా భావిస్తూ ఒకరికొకరు అందజేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

బతుకమ్మకుంటలో వైభవంగా రావణ వధ

పట్టణంలోని బతుకమ్మ కుంటలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జమ్మి పూజలు, రావణ వధ కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి వరకు ఉత్సాహంగా కొనసాగాయి. ప్రముఖ గాయని నిర్మల రాథోడ్‌ తన బృందంతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

బాణసంచా వెలుగుల్లో..

రావణ వధ కార్యక్రమం వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కుంట కట్టపై ఏర్పాటు చేసిన పది తలల రావణాసురుడి ప్రతిమను బాణాసంచాతో పేల్చివేశారు. ఈ సమయంలో ఆకాశమంతా రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది. భారీ బాణసంచా పేలుళ్లు, విద్యుత్‌ దీపాల కాంతులతో పట్టణం దేదీప్యమానంగా వెలిగింది.

వేదికకు దూరంగా ఎమ్మెల్యే..

ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వేదికకు దూరంగా కూర్చొని కార్యక్రమాలను వీక్షించారు. వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి, వైటీడీఏ మెంబర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌, చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, ఇతర ప్రముఖులు ఆశీనులయ్యారు.

బతుకమ్మ కుంటలో అట్టహాసంగా రావణ వధ

బాణసంచా వెలుగుల్లో దేదీప్యమానంగా పట్టణం

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

జమ్మిపూజలు, పాలపిట్ట దర్శనాలతో పల్లెల్లో ఆధ్యాత్మిక శోభ

పటిష్ట పోలీసు బందోబస్తు..

జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాలు, పట్టణ వార్డులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ వాహనాలతో నిరంతరం నిఘా కొనసాగించారు. పండుగ వేడుకలు, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement