మళ్లీ ప్రొటోకాల్‌ రగడ | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ప్రొటోకాల్‌ రగడ

Oct 22 2026 3:38 AM | Updated on Oct 22 2026 3:38 AM

జనగామ: దసరా పండుగను పురస్కరించుకొని పట్టణంలోని బతుకమ్మ కుంటలో మంగళవారం రాత్రి నిర్వహించిన రావణ వధ వేడుకలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రొటోకాల్‌ వివాదం మరోసారి తెరపైకి రావడంతో ఇరువర్గాల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ నినాదాలు చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. చివరకు ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.

ఆలయంలోనూ ప్రొటోకాల్‌ వివాదం

రావణ వధ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దుర్గామాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకునే సమయంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాపరెడ్డి, చేర్యాల ఏఎంసీ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. పూజ చేసే సమయంలో కాంగ్రెస్‌ నాయకులు తనను నెట్టివేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. కనీసం ఆలయంలో పూజలు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వరా అంటూ ఆయన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రొటోకాల్‌ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు, పండుగ వేడుకల్లో పదేపదే వివాదాలకు తెరలేపుతున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పెరిగింది.

వేదిక ఎదుట గ్యాలరీతో మొదలైన వివాదం

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ వధ వేడుకలకు సంబంధించి వేదిక ముందు ఏర్పాటు చేసిన గ్యాలరీలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాపరెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, ఆ పార్టీ కౌన్సిలర్లు కూర్చున్నారు. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేదిక వద్దకు వెళ్లకుండా బయటే కూర్చున్నారు. పరిస్థితిని గమనించిన సీఐ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే వద్దకు వెళ్లి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాను అక్కడికి రానని, బయటే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికారులు రెండు, మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకో లేదు.

నేలపై కూర్చొని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల నిరసన

అధికారికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ నుంచి కాంగ్రెస్‌ నాయకులను వెంటనే పంపించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా వేడుకల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని వారు మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. వేడుకలు ముగిసిన అనంతరం ఇరువర్గాల నాయకులు ఎవరికి వారుగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రొటోకాల్‌ వివాదాలు.. అధికారులకు తలనొప్పి

పట్టణంలో రాజకీయ పార్టీల కార్యక్రమాల సందర్భంగా ప్రొటోకాల్‌ అంశం తరచూ వివాదాలకు దారితీస్తుండటం అధికారులకు తలనొప్పిగా మా రింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నప్పుడు ముందుగానే పోలీ సు యంత్రాంగం అప్రమత్తమై బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. సాధారణంగా స్వల్ప ఉద్రిక్తతలు, ఆరోపణలు, నినాదాలకే పరిమి తమవుతున్న రాజకీయ వివాదాలు, బతుకమ్మ కుంటలో నిర్వహించిన రావణ వధ వేడుకల్లో మాత్రం లాఠీచార్జి వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

రావణ వధ వేడుకల్లో కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య ఉద్రిక్తత

ఇరువర్గాల నినాదాలు

తోపులాట, పోలీసుల లాఠీచార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement