జనగామ: జిల్లాలోని నర్మెట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన ప్రముఖ చెక్క బొమ్మలాట, తోలుబొమ్మలాట, యక్షగాన కళాకారుడు మోతె కొండయ్య మృతి జానపద కళలకు తీరని లోటని కళాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోతె కొండయ్య సుమారు 20 ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంలోని పాలకేంద్రం సమీపంలో రాజీవ్‌నగర్‌లో స్థిరపడ్డారు. తాతలు, తండ్రుల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న చెక్క బొమ్మల కళను ఆయన తన జీవితానికి మార్గంగా ఎంచుకున్నారు. బాల్యం నుంచే కళపై మక్కువ పెంచుకున్న ఆయన, స్వయంగా చెక్కతో బొమ్మలను తయారు చేసి వాటికి కదలికలు కల్పిస్తూ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చేవారు.
బొమ్మల కదలికల్లో జీవం..
కొండయ్య ప్రత్యేకత కేవలం బొమ్మలను తయారు చేయడంలోనే కాదు.. వాటితో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇవ్వడంలోనూ ఉండేది. కర్రతో చెక్కిన బొమ్మలను తన చేతివేళ్ల నైపుణ్యంతో ఆడిస్తూ, వాటితో నృత్యాలు చేయిస్తూ, సంగీతం, సంభాషణల సమన్వయంతో ప్రదర్శనలకు జీవం పోసేవారు. బొమ్మల కదలికలు, హావభావాలు, గానం ప్రేక్షకులకు నిజమైన మనుషులు ప్రదర్శన ఇస్తున్న అనుభూతిని కలిగించేవి. కథను రక్తికట్టించే మాటతీరు, సంగీత పరిజ్ఞానం, కళాత్మక ప్రదర్శనలతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేవారు.
ప్రముఖుల ప్రశంసలు
రాష్ట్రంతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో కొండయ్య తన కళా ప్రదర్శనలతో గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, సుందరయ్య విజ్ఞాన కేంద్రంతో పాటు ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు, అవార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల ప్రశంసలు పొందారు.
వారసత్వాన్ని కొనసాగిస్తున్న కుమారులు
కొండయ్యకు ఉప్పలయ్య, చంద్రయ్య, జనార్దన్, ఐలయ్య, రామలింగం ఐదుగురు కుమారులు ఉన్నారు. తండ్రి నుంచి వారసత్వంగా అందిన చెక్క బొమ్మల కళను వారు కొనసాగిస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళను కుటుంబ సభ్యులు ముందుకు తీసుకెళ్తుండటం విశేషం.
కొండయ్య సేవలు విలువైనవి..
ఆధునిక వినోద మాధ్యమాల ప్రభావంతో సంప్రదాయ జానపద కళలు క్రమంగా కనుమరుగవుతున్న తరుణంలో, కొండయ్య వంటి కళాకారుల సేవలు మరింత విలువైనవిగా నిలుస్తాయి. చెక్కబొమ్మలకు జీవం పోస్తూ తరతరాల కళా వారసత్వాన్ని కాపాడిన ఆయన మృతి జానపద కళారంగానికి తీరని లోటు. ఆయన కళాసేవలను స్మరించుకోవడంతో పాటు, ఆయన వారసులు కొనసాగి స్తున్న ఈ సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని కళాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దేశవిదేశాల్లో చెక్కబొమ్మలాట ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు


