జనగామ: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరి తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న దుర్గాదేవి అమ్మవారి ప్రతిమల నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా శ్రీ విల్లాస్ కాలనీ అమ్మవారితో పాటు ఆయా ప్రాంతాల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి మండపాల నుంచి శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. భజనలు, కోలాటాలు, నృత్యాలతో అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో ముందుకు సాగారు. అమ్మవారి నిమజ్జన కార్యక్రమంతో పట్టణంలో భక్తి భావం వెల్లివిరియగా, భక్తులు అమ్మవారికి ఘనంగా వీడ్కోలు పలికారు.


