దేవరుప్పుల : తెలంగాణలో శతాబ్దాలుగా భూస్వామ్య వ్యవస్థ నడిచిన కాలంలో బహుజన మహిళలు తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం బతుకమ్మ పండుగను ఒక సామాజిక చైతన్య సాధనంగా మలుచుకున్నారని అరుణోదయ సాంస్కృతిక సమైఖ్య వ్యవస్థాపకురాలు విమలక్క అన్నారు. బుధవారం మండలంలోని ధర్మాపురంలో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఆటపాట నిర్వహించారు. తొలుత ఉద్యమాల్లో అమరులైన ఆవుల మల్లయ్య, ఝెషమల్ల వెంకటయ్య, చీటూరి సోమయ్య, జాటోత్ ఠానూనాయక్, దరాగ్యను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. బహుజనుల బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రత్యేక చారిత్రక ఉద్యమ రూపమన్నారు. తమ కష్టాలు, ఆవేదన, శ్రమను బతుకమ్మ పాటల రూపంలో వ్యక్తం చేశారన్నారు. తద్వారానే ఉద్యమ రూపాలు మారి భూసామ్య వ్యవస్థ రూపుమాపు అయ్యిందన్నారు. అలాంటి ఈ పండుగ వెనుక బహుజన వర్గాల శ్రమ, ఆత్మగౌరవం, చైతన్యం దాగి ఉందన్నారు. కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, సర్పంచ్ దౌపాటి అశ్విని, ఉపసర్పంచ్ సంగి రేణుక, రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల సత్తయ్య, కార్యనిర్వహణ కమిటీ అధ్యక్షుడు మెత్కుపల్లి రామచంద్రు, ఝెషమల్ల శ్రీను, అడ్వకేట్ వెన్నెల, సీపీఐ జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, మల్సూర్, రమేశ్ పాల్గొన్నారు.
అరుణోదయ వ్యవస్థాపకురాలు విమలక్క


