రఘునాథపల్లి: ఎల్‌నినో ప్రభావం.. పత్తి రైతులను నిండాముంచింది. వారి ఆశలను ఆవిరి చేసింది. అప్పు చేసి సాగు చేసిన పత్తి పూత, కాత దశలో ఎండిపోతుంటే రైతులు ఏం చేయాలో తెలియక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టాల కడలి నుంచి బయట పడతామనే ఆశలతో పత్తి పంట సాగుచేసిన రైతులకు నిరాశే మిగులుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. పూత, కాత దశలో వేసవిని తలపించేలా ఎండలు, వడగాల్పులు తీవ్రం కావడంతో పంటలు ఊపిరి కోల్పోతున్నాయి. మూడు నాలుగు సార్లు ఎరువులు వేసిన రైతులకు పంటలు ఎండిపోతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. విత్తనాలు, కలుపు, ఎరువులతో కలిపి ఇప్పటి వరకు ఎకరా పత్తికి రూ.35 వేలు వరకు పెట్టుబడి పెట్టారు. గత ఏడాది ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది పత్తి ధర ఆశాజనకంగా ఉన్నా రెండు నుంచి మూడు క్వింటాళ్లు దాటే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలకు రెండు సార్తు పత్తి తీస్తే చేన్లు లూటి పోతాయని, అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో విలవిలలాడుతున్న అన్నదాతలు
పెట్టుబడిగా వేలాది రూపాయలు
ఎకరా చేనులో రెండు క్వింటాళ్ల
దిగుబడి రాని పరిస్థితి


