● నవరాత్రి ఉత్సవాల్లో లక్కీ డ్రా ట్రెండ్
● భక్తితో అమ్మవారికి టోకెన్ కానుక..
● డ్రా తగిలితే తల్లి ఆశీర్వాదమని సంతోషం
జనగామ: పట్టణంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలు మండపాల్లో లక్కీ డ్రా, టోకెన్ల పంపిణీ కొత్త ట్రెండ్‌గా మారుతోంది. భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు బహుమతులపై ఆసక్తి పెంచేలా ఉత్సవ కమిటీలు లక్కీ డ్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. అమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాటు అదృష్టం కలిసివస్తే బహుమతులు గెలుచుకోవచ్చనే ఆశతో భక్తులు టోకెన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
లక్కీ డ్రా..టోకెన్లు
పట్టణంలోని శ్రీ విల్లాస్ కాలనీలో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపంలో లక్కీ డ్రా నిర్వహణకు టోకెన్లు అందుబాటులో ఉంచారు. ఒక్కో టోకెన్‌కు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి బహుమతిగా తులం బంగారం, రెండో బహుమతిగా ల్యాప్ టాప్‌ను ప్రకటించా రు. అదేవిధంగా పట్టణంలోని బీరప్పగడ్డ ఎల్లమ్మ కమాన్ ఆవరణలో టీం మా రాణి దుర్గామయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోనూ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు. రూ.501 చెల్లించి టోకెన్ తీసుకున్న వారికి లక్కీ కూపన్ అందజేయనున్నారు. ఇందులో విజేతకు తులం బంగారం బహుమతిగా ప్రకటించారు. ఇటీవల గణేశ్ నవరాత్రి ఉత్సవాల నుంచి దసరా నవరాత్రుల వరకు పలు మండపాల్లో ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడం కనిపిస్తోంది. భక్తులు టోకెన్లు తీసుకోవడాన్ని అమ్మవారికి కానుక సమర్పించిన భావనతో అనుసంధానించుకుంటుండగా, బహుమతి లభిస్తే అమ్మవారి ప్రసాదంగా భావిస్తున్నారు.


