డిమాండ్‌కు తగ్గట్టు సన్నద్ధత | - | Sakshi
Sakshi News home page

డిమాండ్‌కు తగ్గట్టు సన్నద్ధత

Oct 12 2026 3:49 AM | Updated on Oct 12 2026 3:49 AM

● నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు

ప్రత్యేక చర్యలు

● 4 కొత్త సబ్‌స్టేషన్లు, మరో 7 నిర్మాణం

● ఓల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

జనగామ: జిల్లాలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు నాణ్య మైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించడమే లక్ష్యంగా జనగామ విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ అభివృద్ధికి విస్తృతంగా పనులు చేపడుతున్నారు.

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా

భవిష్యత్తులో పెరిగే విద్యుత్‌ అవసరాలను ముందుగానే అంచనా వేసి 13 పవర్‌ ట్రాన్‌న్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరో 14 అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ అవసరాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నాలుగు కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో ఏడు సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ప్రస్తుత సబ్‌స్టేషన్లపై లోడ్‌ తగ్గడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు తగిన సరఫరా సామర్థ్యం పెరుగనుంది.

ఓల్టేజీ సమస్యల నివారణకు..

విద్యుత్‌ ఓల్టేజీ స్థాయిలను మెరుగుపరిచేందుకు సర్కిల్‌ పరిధిలో 2 ఎంవీఏఆర్‌ సామర్థ్యం కలిగిన 102 కెపాసిటర్‌ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అదనంగా ఏడు కెపాసిటర్‌ బ్యాంకులు ఏర్పాటు చేయగా, మరో 11కు అనుమతులు మంజూరయ్యాయి. అధిక లోడ్‌ ఉన్న 120 విద్యుత్‌ ఫీడర్లపై 600 కేవీఏఆర్‌ సామర్థ్యం కలిగిన కెపాసిటర్‌ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వ్యవసాయ ఫీడర్ల చివరి ప్రాంతాల్లో ఓల్టేజీ సమస్యలు తగ్గి రైతులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా అందనుంది.

ప్రత్యామ్నాయ లైన్లు..

విద్యుత్‌ సరఫరాలో విశ్వసనీయతను పెంచేందుకు 15 ప్రత్యామ్నాయ 33 కేవీ లైన్లను ఏర్పాటు చేశారు. ఏదైనా సబ్‌స్టేషన్‌లో సాంకేతిక లోపం లేదా బ్రేక్‌డౌన్‌ కారణంగా సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రత్యామ్నాయ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశం ఉండేలా ఏర్పాటు చేశారు. దీంతో అంతరాయం సమయం తగ్గి వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై ప్రత్యేక దృష్టి

క్షేత్రస్థాయిలో విద్యుత్‌ లోడ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ అధిక లోడ్‌తో పనిచేస్తున్న డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తిస్తున్నారు. అవసరమైన చోట అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలతో ట్రాన్స్‌ఫార్మర్లపై ఒత్తిడి తగ్గి, వాటి వైఫల్యాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది.

వేసవి అవసరాలకు ముందస్తు ప్రణాళిక

రాబోయే యాసంగి, వేసవి సీజన్లలో పెరిగే విద్యుత్‌ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని టీజీఎన్పీడీసీఎల్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను ముందస్తుగా బలోపేతం చేస్తున్నారు. వ్యవసాయ రంగంతో పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కూడా విద్యుత్‌ పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు.

విద్యుత్‌ పొదుపు అందరి బాధ్యత

జనగామ విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. రాబోయే యాసంగి పంటకాలం, వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నాం. వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించి సంస్థకు సహకరించాలి.

–సంపత్‌రెడ్డి, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement