జనగామ: జిల్లాను రద్దు చేయాలని లేదా దాని ప్రాధాన్యాన్ని తగ్గించాలని ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని, ఖబడ్దార్ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్, మెడికల్ కళాశాల, ఎంసీహెచ్ వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెలి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం నెహ్రూపార్కు నుంచి ర్యాలీగా ఆర్టీసీ చౌరస్తా వరకు చేరుకుని, బహిరంగ సభలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.. జిల్లా కోసం పోరాడింది ప్రజలేనని, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాను అభివృద్ధి చేసిందన్నారు. కడియం శ్రీహరి అయినా, ఇతర నాయకులైనా సర్పంచులు, కౌన్సిలర్లను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే జిల్లాలో కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఆస్పత్రులు, రహదారుల అభివృద్ధి జరిగిందని తెలిపారు. తరి గొప్పుల, చిల్పూరు మండలాల ఏర్పాటు, స్టేషన్ ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ ద్వారా పాలన ప్రజలకు చేరువైందన్నారు. జిల్లా ఏర్పాటుకు కేసీ ఆర్ ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల పోరాట ఫలితమే నేటి జనగామ జిల్లా ఆవిర్భావమన్నారు. రెండేళ్లలో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని, జిల్లా రూపురేఖలను మరింతగా మారుస్తామన్నారు. జిల్లా సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను గుర్తించాలని అన్నారు.
జనగామ గురించి మాట్లాడే హక్కు
కడియంకు లేదు
దశాబ్ది సభలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జిల్లా అభివృద్ధికి కేసీఆర్ కృషి
మరువలేనిది: మాజీ మంత్రి ఎర్రబెల్లి


