● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని ఈనెల 12న(సోమవారం) జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ అధికారి, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ పలు కీలక సూచనలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి రైతు వేదికకు కనీసం 200 మంది రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సోమవారం ఉదయం 11 గంటల లోపు రైతులందరూ తమకు కేటాయించిన రైతు వేదికలకు చేరుకునేలా చూడాలని ఆదేశించారు. ప్రతి రైతు వేదికలో మహిళా రైతులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితులపై అవగాహన కల్పించిన అనంతరం పంటల వైవిధ్యీకరణ, శాఖ సూచించిన వ్యవసాయ పద్ధతులను అనుసరించి ప్రయోజనం పొందిన ఇద్దరు ప్రగతిశీల రైతులను గుర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అవసరమైన ఏర్పాట్లన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వెల్లడించారు.


