● పదేళ్లుగా జీడికల్ యువకుల ప్రత్యేకం
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల నిమజ్జనం అనంతరం యువకులంతా విహార యాత్రలకు వెళ్లి వస్తున్నారు. పదేళ్లుగా గ్రామంలోని యువజన సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి గ్రామంలోని దేవుని చెరువులో నిమజ్జనం చేసిన మరుసటి రోజు విహారయాత్రలకు వెళ్తుంటారు. యువజన సంఘం సభ్యులు ప్రతీ నెల చీటీ నిర్వహించి పొదుపు డబ్బులతో పాటు చీటీ పాట పాడగా వచ్చిన మిత్తి డబ్బులు పోగు చేసుకొని ఇలా యాత్రలకు వెళుతుంటారు. చందాల డబ్బులతో కాకుండా చీటీ డబ్బులనే వినియోగిస్తారు. ఇదీ జీడికల్ గ్రామంలోని వీరాచల, వీరభద్ర, భజరంగ్, ఫ్రెండ్స్ యూత్ సంఘాలతో పాటు ఇతర యువజన సంఘాల ప్రత్యేకం. ఇప్పటి వరకు కాశీ, హరిద్వార్, ద్వారకా, మధ్యప్రదేశ్, యూపీ, యానాం, ముంబాయి, కోల్‌కత్తా, ఏపీ తదితర ప్రాంతాల్లోని దేవాలయాలను, పర్యాటక ప్రాంతాలను పర్యటించి వచ్చారు. ఈ ఏడాది కూడా ముంబాయి. గుజరాత్, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే టికెట్లు బుక్ చేసుకున్నారు.


