వడివడిగా.. | - | Sakshi
Sakshi News home page

వడివడిగా..

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ డివిజన్‌తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు త్వరలో వైద్య, ఆరోగ్య సమస్యల కష్టాలు తీరనున్నాయి. డివిజన్‌ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో ప్రజలకు చిరకాల కోరికగా ఉన్న వందపడకల ఆస్పత్రి నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. డిసెంబర్‌ నెలాఖరులోపు పనులు పూర్తి చేసి నూతన సంవత్సరం జనవరిలో ఆస్పత్రి వైద్య సేవలు ప్రారంభించేలా పనులు చకచకా చేస్తున్నారు. జీప్లస్‌ 2 భవన నిర్మాణంతో పాటు మూడు ఫ్లోర్స్‌లో గదుల నిర్మాణాలు పూర్తయ్యాయి. పెయింటింగ్‌, వైరింగ్‌, కార్పెంటరీ తదితర పనులు చేయాల్సి ఉంది. ఆస్పత్రి చుట్టూ వంద ఫీట్ల రోడ్డు, డివైడర్స్‌ ఏర్పాటు పనులను చేపడుతున్నారు. నాలుగు ఎకరాల స్థలంలో ఆస్పత్రి నిర్మాణం చేస్తుండగా ఆస్పత్రి భవనాన్ని 75,438 చదరపు అడుగులు, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌ మూడింటిని 24,705 స్క్వేర్‌ ఫీట్స్‌తో నిర్మాణం చేస్తున్నారు.

రూ.45.50 కోట్లతో పనులు

ప్రస్తుతం స్టేషన్‌ఘన్‌పూర్‌లో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రికి రోజూ ఓపీ దాదాపు 200 మంది వస్తుంటారు. ప్రాథమిక వైద్య సేవలు, నార్మల్‌ డెలివరీలు, జనరల్‌ వైద్య సేవలు అందుతున్నాయి. ఏదైనా అత్యవసర కేసులు, క్రిమిసంహార మందులు తాగిన వారిని, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి, జనగామ ఏరియా ఆస్పత్రికి రెఫర్‌ చేస్తున్నారు. అయితే దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న ఆస్పత్రులకు వెళ్లే సరికి క్షతగాత్రులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి. ఆస్పత్రి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించారు. 2025 జనవరి 20న స్టేషన్‌ఘన్‌పూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.45.50 కోట్లు నిధులు సీఎం మంజూరీ చేయగా మార్చి 16న స్టేషన్‌ఘన్‌పూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా మే 12న ఎమ్మెల్యే కడియం శ్రీహరి పనులు ప్రారంభించారు.

అధునాతన వైద్యసేవలు

24 గంటల వైద్య సేవలతో పాటు అంబులెన్స్‌ సేవలు, ఆపరేషన్‌ థియేటర్స్‌, బ్లడ్‌ బ్యాంకు, ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఆస్పత్రిలో జనరల్‌ వైద్య సేవలతో పాటు గైనిక్‌, సర్జన్‌, ఫీజిషియన్‌, పిల్లల వైద్యులు, దంత వైద్యులు, ఫిజియోథెరపీ, న్యూరో, మత్తు వైద్యులు తదితర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. జనవరి 2026 నుంచి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానుండగా నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముమ్మరంగా సాగుతున్న ఘన్‌పూర్‌

వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు

రూ.45.50 కోట్లతో జరుగుతున్న పనులు

తీరనున్న ప్రజల వైద్య ఆరోగ్య కష్టాలు

జనవరిలో అందుబాటులోకి ఆస్పత్రి సేవలు

జనవరిలో ప్రారంభించేలా..

త్వరలో వందపడకల ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. జనవరిలో ఆస్పత్రిని ప్రారంభించేలా ఎమ్మెల్యే కడియం కృషి చేస్తున్నారు. వందపడకల ఆస్పత్రి ప్రారంభిస్తే నియోజకవర్గ ప్రజల చిరకాల కల నెరవేరుతుందన్నారు.

– అంబటి కిషన్‌రాజ్‌,

కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అఽఽధ్యక్షుడు

ప్రజలకు అత్యాధునిక సేవలు

త్వరలో వందపడకల ఆస్పత్రితో గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో ఘన్‌పూర్‌కు వంద పడకల ఆస్పత్రి వచ్చింది. రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి త్వరగా మెరుగైన వైద్యసేవలు అందించి వారి ప్రాణాలను రక్షించవచ్చు.

–డాక్టర్‌ సంధ్య, ఘన్‌పూర్‌

ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement