ఈ నెల 14 నుంచి 15 వరకు జిల్లాలో వర్షపాతం (మి.మీ.లలో)
ఊపిరి పోసిన
జనగామ: జిల్లాలో సోమవారం గంటన్నర పాటు కురిసిన భారీ వర్షంతో ఎండిపోతున్న వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం వచ్చింది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరగా పలు చోట్ల వాగులు పొంగిపొర్లాయి. భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం వాగులోని చెక్‌డ్యాం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటితో నిండి మత్తడి పోస్తోంది. స్థానికంగా భారీ వర్షాలు లేకున్నా నీటి ప్రవాహం రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నర్మెటలో అత్యధిక వర్షం కురిసింది.
మండలాల వారీగా...
జనగామ మండలంలో రెండు రోజుల వర్షంతో పంటలకు ఊరట కలిగించింది. మోస్తరు వర్షం పడినా భారీ వరదలు లేకపోవడంతో చెరువుల్లో 10 నుంచి 20 శాతం లోపు నీరు చేరింది. భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయే దశలో ఉన్న వరి పంటలకు వర్షం మేలు చేసింది. చిన్న కాలువల్లో నీటి ప్రవాహంతో బోర్లు సమృద్ధిగా పోస్తున్నాయి. స్టేషన్‌న్ ఘన్‌న్‌పూర్‌లో 73 చెరువులు, కుంటల పరిధిలో 50 నుంచి 75 శాతం, మరికొన్ని గ్రామాల్లో 25 నుంచి 50 శాతం నీరు చేరింది. తాటికొండ–కొత్తపల్లి వాగు పొంగిపొర్లగా వల్లభరాయి, రాఘవపూర్ బంజరు చెరువుల మత్తడులు పోశాయి. నర్మెటలో వెల్దండ చెరువు మత్తడి వరకు చేరగా మిగిలిన వాటిలో 50 నుంచి 70 శాతం నీరు చేరింది. జఫర్‌గఢ్‌లో 13 చెరువులు, 88 కుంటల్లోకి కొద్దిపాటి నీరు చేరింది. కొడకండ్లలో 30 చెరువుల పరిధిలో 25–50 శాతం నీరు చేరగా, నర్సింగాపురం చౌటకుంట నిండి అలుగు పోస్తోంది. బచ్చన్నపేటలో 18 చెరువులు, 100 కుంటలకు సుమారు 10 శాతం నీరు చేరింది. లింగాలఘణపురంలో భారీ వర్షం లేకున్నా పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు మేలు జరిగింది.
జిల్లాలో చెరువుల నీటిమట్టాల స్థితిగతులు
జిల్లా వ్యాప్తంగా 771 చిన్న నీటిపారుదల చెరువుల పరిధిలో 50,416 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్ర స్తుతం 43 చెరువులు అలుగు పారుతుండగా, 85 చెరువులు 75 నుంచి 100 శాతం వరకు నిండాయి. మరో 86 చెరువులు 50 నుంచి 75 శాతం, 74 చెరువులు 25 నుంచి 50 శాతం నిల్వ కలిగి ఉన్నాయి. అత్యధికంగా 483 చెరువుల్లో 0 నుంచి 25 శాతం లోపే నీరుంది.
ప్రధాన రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో నీటినిల్వలు
జిల్లా పరిధిలో గండిరామవరం రిజర్వాయర్ 84.84శాతం, కన్నెబోయినగూడెం రిజర్వాయర్‌లో 80.41, వెల్దండ రిజర్వాయర్‌లో 75.30, అశ్వరావుపల్లి రిజర్వాయర్‌లో 69.73, బొమ్మకూరు రిజర్వాయర్‌లో 64.26, ఆర్‌ఎస్ ఘన్‌పూర్ 61.20 రిజర్వాయర్‌లో నీటి నిల్వలు కలిగి ఉన్నాయి. నష్కల్ రిజర్వాయర్‌లో 55.29శాతం, చీటకోడూరు రిజర్వాయర్‌లో 44.87శాతం, నవాబుపేట రిజర్వాయర్‌లో 34.77 శాతం నిండాయి.
చెరువులు, కుంటలకు జలకళ
మత్తళ్లు పోస్తున్న పలు చెరువులు
జిల్లాలో నర్మెటలో అత్యధిక వర్షం


