జనగామ రూరల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ నెల 17న జరగబోయే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 9 గంటల వరకు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. అలాగే కలెక్టరేట్‌లో ముఖ్యఅతిథితో ఉదయం 9 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని, అనంతరం అమరులకు నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఏసీపీ భీంశర్మ, డీఎం సీఎస్ హాతీరామ్, కలెక్టరేట్ ఏఓ రవికిరణ్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జనగామ రూరల్: సమగ్ర శిక్ష, భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 16న (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని కోర్టు సమీపంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల వైద్య పరి శీలన, ఉచిత పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరం సర్టిఫికెట్‌తో పాటు నమోదు రశీదు, ఆధార్ కార్డ్, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఉపాధ్యాయులు , తల్లిదండ్రుల ఐడెంటిటీ ప్రూఫ్‌తో విద్యార్థులు హాజరు కావాలని అన్నారు. వైకల్య శాతాన్ని పరిశీలించి అవసరమైన వినికిడి యంత్రాలు, వీల్‌ఛైర్లు, కాలీపర్స్, వైట్ కేస్, ట్రై సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలను అంచనా వేసి ఎంపిక చేయనున్నట్లు వివరించారు.
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎప్‌సెట్–2026 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ తెలిపా రు. మొదటి రోజు 240 పైగా మంది విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి. భవాని, జె.శ్రీదేవి, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఏఐఎస్‌ఎఫ్ నిరంతర పోరాటాలు చేస్తోందని సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. డివిజన్ కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా మహాసభలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీ య అధ్యక్షుడు సయ్యద్ వలిఉల్లా ఖాద్రీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ యూనిస్ అధ్యక్షతన ని ర్వహించిన మహాసభలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మ ణ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్న జీఓ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండీ.రహ్మతుల్లా, పృథ్వీరాజ్, అక్షయ్, జీవన్, రాము, రోహిత్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ: కొత్త చేయూత పెన్షన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 16వ తేదీ(బుధవారం) సాయంత్రం 5 గంటల వర కు పొడిగించినట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. మూడు రోజులుగా వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో దరఖాస్తుదారుల సౌకర్యార్థం గడువు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంటి విభాగం ఆధ్వర్యంలో ధర్మకంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థుల కు కంటి పరీక్షలు నిర్వహించారు. జేడీఏన్‌పీసీ బీ, డీఎంహెచ్‌ఓ, జిల్లా అంధత్వ నియంత్రణ సొసైటీ పర్యవేక్షణలో ఆర్‌బీఎస్‌కే బృందం సమన్వయంతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 44 మంది విద్యార్థుల్లో రిఫ్రాక్టివ్ లోపాలు గుర్తించారు. వారికి అవసరమైన కళ్లద్దాలు అందించాలని సిఫారసు చేశారు.


