వినాయక.. వివిధ రూపాయ! | - | Sakshi
Sakshi News home page

వినాయక.. వివిధ రూపాయ!

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

జనగామ: వినాయక చవితి వేళ జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గణనాథుల విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటుండగా, రాజస్థాన్‌ నుంచి వచ్చిన కళాకారులు తమ నైపుణ్యంతో మట్టి, పీఓపీ(ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌) ప్రతిమలకు అందమైన రూపాలుగా తీర్చిదిద్దారు. మూ డు నుంచి 15 అడుగుల వరకు విగ్రహాలు అందుబాటులో ఉండగా, భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. రంగురంగుల గణపయ్యలతో వీధులు కళకళలాడుతుండగా, పూజా సామగ్రి, అలంకరణ, లైటింగ్‌ వ్యాపారాలు ఊపందుకున్నాయి. వినాయక చవితి పండుగకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి.

పెరిగిన ముడిసరుకు ధరలు

ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ ఏడాది ఒక్కో విగ్రహంపై సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ధర పెరిగినట్లు తయారీదారులు చెబుతున్నారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన కుటుంబాలు గత రెండున్నర దశాబ్దాలుగా జిల్లా కేంద్రంలో విగ్రహాల తయారీ, విక్రయాలు కొనసాగిస్తున్నాయి. సుమారు ఆరు నెలల ముందు నుంచే పీఓపీ విగ్రహాల తయారీ ప్రక్రియను ప్రారంభించారు.

రంగురంగుల రూపాల్లో ప్రత్యేక ఆకర్షణ

కళాకారులు తమ నైపుణ్యంతో ఆకర్షణీయమైన రూపాలు, రంగురంగుల అలంకరణలతో వినాయక ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 2 వేల విగ్రహాలను తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వాటిలో దాదాపు 40 శాతం ఇప్పటికే అమ్ముడుపోగా.. మరో 60 శాతం విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

వందల మందికి ఉపాధి

వినాయక చవితి ఉత్సవాలు తయారీదారులు, కళాకారులు, డెకరేషన్‌, లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌, రవాణా, పూజా సామగ్రి వ్యాపారులకు ఉపాధి కల్పిస్తున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తొమ్మిది రోజుల పాటు గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రూ.3 వేల నుంచి రూ.60 వేల వరకు

జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్‌ ఏరియాతో పాటు హనుమకొండ రోడ్డులోని రేణుకా ఎల్లమ్మ ఆలయం సమీపంలో రాజస్థాన్‌ నుంచి వచ్చిన తయారీదారులు విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మూడు అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తు వరకు వినాయక విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. పరిమాణం, ఆకృతి, అలంకరణను బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు, రూ.8వేలు, రూ.10వేలు, రూ.15వేలు, రూ.20వేలు, రూ.30వేలు, రూ.40వేలు, రూ.60వేల వరకు ధరలు పలుకుతున్నాయి.

తీరొక్క రూపం..

ఆకట్టుకొనే విగ్రహం

జోరందుకున్న వినాయక ప్రతిమల అమ్మకాలు

గణపయ్య రాకతో ఆధ్యాత్మిక శోభ

విగ్రహాలకు పెరిగిన డిమాండ్‌

ఊపందుకున్న అనుబంధ వ్యాపారాలు

అనుబంధ వ్యాపారానికి ఊపు

విగ్రహాల విక్రయాలతో పాటు పూజా సామగ్రి, కాషాయ జెండాలు, లైటింగ్‌ సామగ్రి, టార్పాలిన్‌ కవర్లు, డెకరేషన్‌ ఫ్లెక్సీలు, ఆర్చీలు, సౌండ్‌ సిస్టమ్స్‌ తదితరాల వ్యాపారం కూడా జోరందుకుంది. హనుమకొండ, సిద్దిపేట, హైదరాబాద్‌, సూర్యాపేట రోడ్లలోని తయారీ కేంద్రాలతో పాటు హైదరాబాద్‌ అంబర్‌ పేట, ధూల్‌పేట తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా విగ్రహాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పట్టణంలో సుమారు పది వరకు వినాయక విగ్రహాల విక్రయ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement